తహశీల్దార్ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
తన తండ్రి పేరుపై ఉన్న 5 గుంటల భూమిని అధికారులు ఆన్ లైన్ నుంచి తొలగించారని, పైగా తమపై అక్రమ కేసు పెట్టారంటూ అన్నదమ్ములిద్దరు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన తమ తండ్రి మామిడి లింగయ్యకు సర్వే నంబరు 362లో 5 గుంటల భూమి ఉందని, మే నెల వరకు వన్‌బీలో ఉందని, రైతుబంధు కూడా తీసుకుంటున్నామని కొడుకులు చందు, అంజయ్య తెలిపారు. కాగా 15 రోజులుగా ఆన్ లైన్ లో తమ భూమి చూపించడం లేదని, అక్రమ పాస్ బుక్ కలిగి ఉన్నామని తమపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. తమ భూమి తమకు ఇప్పించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఇద్దరూ తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చి మీద పెట్రోల్ పోసుకున్నారు. అక్కడే ఉన్న ఆఫీస్ సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకున్నారు. డ్యూటీ పూర్తి చేసుకుని వెళుతున్న తహసీల్దార్ వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు. తహసీల్దార్ రవీందర్ రావు మాట్లాడుతూ మామిడి లింగయ్యకు చెందిన రెండు గుంటల భూమి 2011లో ఎల్లంపెల్లి కాలువ కింద పోయిందని అన్నారు. నష్టపరిహారం తీసుకోకపోవడంతో కోర్టులో జమ చేసినట్లు తెలిపారు.