ఏపీకి 18 వేల కోట్లు ఇచ్చామన్న కేంద్రం
న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద నాలుగేళ్ళ వ్యవధిలో ఆంధ్ర ప్రదేశ్‌కు 18 వేల 562 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు రాజ్య సభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెల్లడించారు. నరేగా కింద ఏపీకి 2015-16లో 2856.85 కోట్లు, 2016-17లో 3997.46 కోట్లు, 2017-18లో 5287.32 కోట్లు 2018-19 (ఫిబ్రవరి 5 నాటికి) 6420.94 కోట్లు నిధులను కేంద్రం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.ఉపాధి హామీ చట్టం కింద డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే పథకం ఇది. అందువలన ఏ రాష్ట్రానికి కేటాయింపు ముందుగా జరగదని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డిమాండ్‌కు తగినట్లుగా ఉపాధి కల్పించడానికి శాయశక్తులా కృషి చేసినట్లు తెలుపుతూ మంత్రి అందుకు అనుగుణంగా గణాంకాలను వివరించారు. ఈ పథకం అమలులో నిధుల దారి మళ్ళింపు, అవకతవకలకు సంబంధించి తమ మంత్రిత్వ శాఖకు అందే ఫిర్యాదులపై తగు విచారణ, చర్యల కోసం పథకాన్ని అమలు చేస్తున్న ఆయా రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందని మంత్రి చెప్పారు.