మంత్రి హరీశ్ పేషీకి తాళం

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు కరోనా టెన్షన్ పట్టుకుంది. వారి దగ్గర పనిచేసే డ్రైవర్లు, పీఏలకు పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. దాంతో చాలా మంది ఇండ్ల నుంచే పనిచేస్తున్నారు. ఫైళ్లను శానిటైజ్ చేసినంకనే ముడుతున్నరు. బాగా ఇంపార్టెంట్ మీటింగులు ఉంటెనే డైరెక్టుగా అటెండ్ అవుతున్నారు. కొందరు టూర్లను వాయిదా వేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. రామ్మోహన్ ఇంటికే పరిమితమయ్యారు. శుక్రవారం మరోసారి టెస్ట్ చేయించుకున్నారు. రిజల్ట్ వచ్చే దాకా బయటికి రారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
మంత్రి హరీశ్ పేషీకి తాళం
మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా పాజిటివ్ రావడంతో అరణ్య భవన్ లోని మంత్రి కార్యాలయానికి తాళం వేశారు. స్టాఫ్కు వారం పాటు సెలవు ప్రకటించారు. మంత్రిని కలిసేందుకు వస్తున్న విజిటర్స్ ను తిప్పి పంపేస్తున్నారు. హరీశ్రావు కూడా వారం పాటు టూర్లను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. మంత్రి హరీశ్రావు ఆఫీసు నుంచే ఆ వీడియో కాన్ఫరెన్స్అటెండ్ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ పీఏకు పాజిటివ్ అని తేలడంతో.. వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లను రాత్రికి రాత్రే మంత్రి ఇంటికి మార్చారు. ఇక కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లోని తన క్యాంప్ ఆఫీసు నుంచే రివ్యూలు చేశారు. విజిటర్స్ ను తగ్గించాలని తన స్టాఫ్కు సూచించినట్టు తెలిసింది.
ఇంటి నుంచే ఆఫీసర్ల డ్యూటీ
కొందరు ఐఏఎస్ లు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ లు ఉంటే మాత్రమే సెక్రటేరియట్ఉన్న బీఆర్కే భవన్కు వస్తున్నారు. ఇక్కడ పనిచేసే కొందరు స్టాఫ్కు పాజిటివ్ రావడంతో.. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేశారు. ఇక కొందరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇంటి నుంచే
డ్యూటీ చేస్తున్నారు.