రైతుబంధు- బంధువేనా ?
బంధువు అంటే మన భాషలో చుట్టం. మన ఇంటికి చుట్టం అదే బంధువు వస్తే ఎన్ని రోజులు ఉంటాడు. ఒకటి లేదా రెండు రోజులు మహా అయితే మూడు రోజులు ఉంటారు. అంతేకానీ శాశ్వతంగా మాత్రం మన దగ్గర ఉండరు. ఇప్పుడు సర్కార్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం కూడా అలాగే ఉంది. ఏదో పేదింటి రైతుకి చుట్టంచూపుల వచ్చినట్టు ఉంది. నిజంగా ఆ పథకానికి బంధువు అనే పదం అందుకే పెట్టారేమో. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. 2018 వానకాలంలో ప్రారంభమైన రైతుబంధు పథకం 2020 వానకాలం వచ్చే సరికి బెడిసికొట్టేలా ఉంది. పొమ్మన్న లేక పోగ పెట్టినట్టు… సర్కార్ చెప్పిన పంట వేస్తే తప్పా ఇప్పుడు సర్కార్ అందించే సాయం రాదని చెబుతున్నారు. బంధువులా వచ్చిన రైతుబంధు పథకం ఇప్పుడు బంధువులానే వెళ్లిపోతోంది. మన ఇంటి వచ్చిన ఆప్త బంధువులు వెళ్లిపోతే కొంత బాధగా ఉంటుంది. ఇంకా రెండు మూడు రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలోని పేద రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. పొలం పెట్టుబడికి ఇంటికి పెద్దన్నలా సాయం కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రైతులలో చాలా బాధకలిగిస్తోంది.
తెలంగాణలోని 32 జిల్లాలలో వివిధ రకాలైన సారవంతమైన భూములు ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కో రకమైన పంటలు పండుతాయి. కానీ సర్కార్ చెబుతున్నట్టు అన్ని చోట్ల సన్నరకాలైన వరి పండించలేరు, పత్తి పంటలు వేయలేరు. అలాగే వారు చెప్పినట్టు వేస్తే… రాష్ట్రంలో మొక్కజొన్న పంటల ఉత్పత్తులు తగ్గిపోయి వాటికి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు అధిక ధరలు పెట్టి పక్కరాష్ట్రాల నుండి వాటిని కొనుగొలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వాటిని వినియోగించే పౌల్ట్రీ ఇండస్ట్రీ వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతారు. అలాగే వాటి అనుబంధ వ్యాపారమైన కోళ్ల అమ్మకం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. దీంతో ఎటూ చూసిన చివరికి నష్ట పోయోది సామన్య ప్రజలు మాత్రమే. అంతేకాని ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వాటిల్లదు.
చివరికి అన్ని విధాలుగా ప్రభుత్వం చెప్పినట్టు ముందుగా రైతులు మళ్లీ అప్పులు చేసి పంట సాగు చేస్తే… ఆ పంటలు సరిగా దిగుబడి రాకా… తెచ్చిన అప్పులు కట్టలేక… ప్రభుత్వం అందించిన అరకొర పైసలు సరిపోక అంతిమంగా మళ్లీ కష్టాల పడేది ఒక్క రైతు మాత్రమే. ఇక్కడ కూడా ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతుంది. అంతేకానీ రైతుబంధు వల్ల ఏ ఒక్క రైతు కూడా లాభపడడు.
32 జిల్లాలు, 108 డివిజన్లు, 568 మండలాలు, 2245 క్లస్టర్లు, 10874 గ్రామాలు, 57,15, 870 మంది రైతులకు ప్రభుత్వం 12వేల కోట్ల రూపాయలు రైతు బంధు పథకం కింద అందిస్తోంది. ఇందులో ఖచ్చితంగా లాభపడుతున్న రైతులు ఎంత మందో ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు. ఈ లెక్కలలో ఎంతో మంది భూస్వాములు ఉన్నారు. ఇక్కడ లాభపడేది వారు తప్పా , కౌలు చేసే రైతు కాదు. అసలు కౌలు రైతులకు ప్రభుత్వం ఎటువంటి సాయం చేస్తుందో అనే సరైన ప్రకటన లేదు.
జిల్లాలుగా చూసుకుంటే ఆదిలాబాద్‌లో 1,16927, భద్రాధి కొత్తగుడెంలో 99621, జగిత్యాలలో 204906, జనగాంలో 145,992, జయశంకర్ భూపాలపల్లిలో 155770, జోగులాంబ గద్వాల్‌లో 148512, కామారెడ్డిలో 244920, కరీంనగర్‌లో 157970, ఖమ్మంలో 264724, కొమరంభీం ఆసిఫాబాద్‌లో 91812, మహబూబాబాద్‌లో 123241, మహబూబ్‌నగర్‌లో 334947,
మంచిర్యాల 130641, మెదక్‌లో 213316, నాగర్‌కర్నూలులో 263,215, నల్గొండలో 419723, నిర్మల్ 157268, నిజామాబాద్ లో 238909, పెద్దపల్లిలో 127528, రాజన్న సిరిసిల్లాలో 105074, సంగారెడ్డిలో 316137, సిద్ధిపేట258306, సూర్యపేట 232653, వికరాబాద్‌లో 224704, వనపర్తిలో 152025, వరంగల్ అర్బన్ లో 78288, వరంగల్ రూరల్ 167452, యాదాద్రి భువనగిరిలో 182455 మంది రైతులు ఉన్నట్టు సాక్షాత్తూ రైతుబంధు వెట్‌సైటల్‌లో పొందుపరిచారు. ఇందులో ఎంతమంది నిజమైన రైతులు ఉన్నారు కౌలు రైతులు ఎంత మంది అన్న లెక్క ప్రభుత్వం సరిగా లేవు.
అసలు ఇప్పుడు రైతుబంధు బంద్ చేయడాని ఓ పక్క కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని వాటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెబుతున్నారు. మరో పక్క తాము చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు పైసలు ఇస్తామని చెబుతున్నారు. అసలు తెలంగాణ రాకముందు రైతులు ఎవరూ పంటల పండించలేదా… లేక రైతుబంధు పథకం రాకముందు రైతులు పెట్టుబడి పెట్టి పండించలేదా అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో వస్తుంది.
సీఎం కేసీఆర్ మాటలు చూస్తుంటే ఆ పథకం మీద రైతులు ఇగ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని అనిపిస్తోంది. ఇలా చేస్తే బంగారు తెలంగాణ కాస్తా ఏదో తెలంగాణ అయ్యెట్టు ఉంది.