పొలంలో దొరికిన వెండి ఆభ‌ర‌ణాలు

డెక్క‌న్ న్యూస్ ప్ర‌తినిధి, శ్రీకాంత్ చారి

ఓ రైతు వ్యవసాయ పొలంలో రాగి పాత్రలు, వెండి అభరణాలు లభ్యమైన ఘటన పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. సుల్తాన్‌నగర్‌ గ్రామానికి చెందిన సిద్దిఖీ గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటుండడంతో మంగళవారం తన వ్యవసాయ పొలంలో ఇంటి బేస్మెంట్‌ కోసం మట్టిని తవ్వుతుండగా మూడు రాగి, రెండు ఇత్తడి పాత్రలు బయటపడ్డాయి. అందులో కొన్ని ఆభరణాలు లభించాయి. దొరికిన వాటిని రైతు సిద్దిఖీతో పాటు పక్క పొలానికి చెందిన మరో ఇద్దరితో కలిసి సమానంగా పంచుకున్నారు. ఈ విషయం కొందరి ద్వారా బయటకు పొక్కడంతో తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, ఎస్సై శ్రీశైలం గ్రామాన్ని సందర్శించి విషయాన్ని ఆరా తీశారు. వారి నుంచి పాత్రలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 832 గ్రామాల వెండి, మూడు రాగి పాత్రలు, రెండు ఇత్తడి పాత్రలు ఉన్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. గతంలో ఓ పాడుబడిన బావిలోంచి మట్టి తీసి అక్కడ పోశారని దాంట్లో అవి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.