ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఓ ప్రధాన ఘట్టాన్ని తీసుకుని సినిమా చేయడం బహుశా ‘యాత్ర’తో మొదలు
నటీనటులు: మమ్ముట్టి, రావు రమేష్, ఆశ్రిత వేముగంటి, తోటపల్లి మధు, సచిన్ ఖడేకర్, కళ్యాణి తదితరులునిర్మాణ సంస్థ: 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్
సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి
కెమెరా: సత్యన్ సూరయన్ సంగీతం: కె
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
రచన, దర్శకత్వం: మహి వి. రాఘవ్
వెండితెరపైకి సినిమా నటుల జీవితాలు వచ్చాయి. రాజకీయ నాయకుల కథలూ వచ్చాయి. కానీ, ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఓ ప్రధాన ఘట్టాన్ని తీసుకుని సినిమా చేయడం బహుశా ‘యాత్ర’తో మొదలు అనుకుంట! ప్రజల మధ్యలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రలో ప్రేక్షకులకు తెలియని కొత్త అంశాలు ఉంటాయా? పాదయాత్రలో ఓ సినిమాకు కావలసిన కథ ఉందా? వైయస్సార్ జీవితంలో ఈ పాదయాత్ర ప్రాముఖ్యత ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
కథ: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న మనదేశం (తెలుగు దేశం) పార్టీ అధినేత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కాంగ్రెస్ నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి (మమ్ముట్టి)తో ఆయనకు అత్యంత ఆప్తుడు అయిన కెవిపి (రావు రమేష్) “ముందస్తు ఎన్నికలకు సరిపడా శక్తి సామర్ధ్యాలు మన దగ్గర లేవు. సర్వేలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయి. మనం అధికారంలోకి రావడం కష్టమే” అని చెప్తారు. దాంతో రాజకీయాల్లోంచి బయటకు రావాలకున్న వైయస్సార్, పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసిన అంశాలేంటి? పాదయాత్రలో ప్రజలను కష్టాలను చూసిన వైయస్సార్ ఏం చేశారు? ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రవేశపెట్టడానికి పాదయాత్రలో పునాది ఎలా పడింది? అనేది సినిమా.
ఎనాలసిస్ : రాజశేఖరరెడ్డి గారి గొప్పతనం గురించి చెప్పడానికి మరొకరిని చెడుగా చూపించాల్సిన అవసరం లేదు – యాత్ర విడుదలకు ముందు దర్శకుడు మహి వి రాఘవ్ చెప్పిన మాట ఇది. కానీ, సినిమాలో ఈ మాటకు భిన్నంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సినిమాలో ఓ పార్టీ పేరు మన దేశం. అధికారంలో ఉన్నది ఆ పార్టీయే. ఆ పార్టీ నాయకులందరూ పసుపు రంగు చొక్కాలు వేసుకుంటారు. తమ నాయకుడు హైటెక్ సిటీ కట్టడంవల్ల తమ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తుంటారు. ఈ ప్రస్తావన అంతా తెలుగుదేశం పార్టీ గురించి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సన్నివేశాలన్నీ ఓ వర్గం ప్రేక్షకులకు, ఓ పార్టీని అభిమానించే ప్రజలకు పంటికింద రాయిలా తగులుతుంటాయి. వీటిని వైయస్సార్ పాదయాత్రను భావోద్వేగభరిత ‘యాత్ర’గా మలచడంలో దర్శకుడు మహి వి. రాఘవ్ నూటికి నూరు శాతం విజయం సాధించాడు. ప్రజలను కథలో భాగస్వామ్యులు చేయడంలో సఫలీకృతమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద వైయస్సార్ ధిక్కార స్వరం వినిపించిన ప్రతి సన్నివేశంలో హీరోయిజాన్ని చూపించాడు. రాజకీయాలను పక్కనపెట్టి.. ‘యాత్ర’ను ఓ కథగా చూస్తే అందులో హీరోయిజం ఉంది. సగటు మనిషి హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఉన్నాయి. పలు ప్రతికూలతల మధ్య పట్టుదలతో ముందడుగు వేసిన ఓ నాయకుడి రాజసం ఉంది. నిర్మాతలు ఇంకాస్త ఖర్చు పెడితే… జనసందోహం మధ్య తీసిన పాదయాత్ర సన్నివేశాలు మరింత భారీగా వచ్చేవేమో. సినిమాటోగ్రఫీ బావుంది. సిరివెన్నెల సాహిత్యం రాజశేఖరరెడ్డి గొప్పతనాన్ని వర్ణించింది. సంగీతం చక్కగా కుదిరింది.
ప్లస్ పాయింట్స్: మహి వి. రాఘవ్ దర్శకత్వంమమ్ముట్టి నటన భావోద్వేగాలు సంగీతం, సాహిత్యం
మమ్ముట్టి నటన భావోద్వేగాలు సంగీతం, సాహిత్యంమైనస్ పాయింట్స్: తెలుగుదేశం పార్టీ ప్రస్తావన
నటీనటుల పనితీరు: రాజశేఖరరెడ్డిని ఇమిటేట్ చేయడానికి మమ్ముట్టి ప్రయత్నించలేదు. కానీ, రాజశేఖరరెడ్డిలో మొండితనం, పట్టుదలను నటనలో చూపించారు. మమ్ముట్టిలో రాజశేఖరరెడ్డి పోలికలు లేకున్నా… కథ మొదలైన కాసేపటికి తెరపై కనిపిస్తున్నది రాజశేఖరరెడ్డియే అన్నట్టు నటించారు. మిగతా నటీనటుల్లో రావు రమేష్‌కి మంచి పాత్ర దక్కింది. వైయస్సార్ సన్నిహితుడు కెవిపి పాత్రలో ఆయన కనిపించారు. ఆశ్రిత వేముగంటిలో విజయమ్మ పోలికలున్నాయి. సుహాసిని, అనసూయ అతిథి పాత్రల్లో మెరిశారు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: ఓ విధంగా చూస్తే ఈ సినిమా రాజకీయ కరపత్రమే. రాజశేఖరరెడ్డిని ప్రజలకు మరోసారి గుర్తుచేసే చిత్రమే. వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైకాపాకు ఉపయోగపడే చిత్రమే. ముఖ్యంగా చివర్లో వచ్చే పెంచల్ దాస్ పాడిన పాట ఫక్తు రాజకీయ ప్రచార గీతమే. అయితే… రాజశేఖరుడి రాజసంతో పాటు సగటు ప్రేక్షకులను కదిలించే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. కంటతడి పెట్టించే సన్నివేశాలు ఉన్నాయి. మమ్ముట్టి అద్భుత నటన, చక్కటి దర్శకత్వ ప్రతిభ ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది.