తెలంగాణలో గుట్టలెక్కికి వచ్చిన గోదారమ్మ
నయాగర జలపాతంలా కొండపోచమ్మ సాగర్ కనిపిస్తోంది అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నాగార్జున సాగర్ కాలువ కంటే కొండ పోచమ్మ సాగర్ కాలువ పెద్దది అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇంత పెద్ద కాల్వ ఎక్కడా లేదు. నాగార్జున సాగర్ కాలువ 11 వేల క్యూసెక్కులు ఉంటే.. ఇది 11,500 క్యూసెక్కుల ప్రవాహంతో ఉంది. మల్లన్నసాగర్ నుంచి మర్కూక్ పంపు హౌజ్ వరకు 28 కిలోమీటర్ల దూరం ఉంది. 23 కిలోమీటర్ల వరకు ఒక టీఎంసీ మాత్రమే వస్తుంది. ఆ ఒక టీఎంసీ ఉండే దగ్గ ఈత పడితే.. కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వచ్చి కొండపోచమ్మ సాగర్‌లో తేలే అవకాశం ఉంది. దీనిపై ప్రజలను, పిల్లలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ ఘాట్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించానని సీఎం తెలిపారు. జిల్లా అధికారులు సూచించిన ప్రాంతాల్లోనే పిల్లలు, పెద్దలు స్నానం చేయాలి.
కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు అపూరపమైన ప్రాజెక్టు అని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదో లిఫ్టు కింద కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు కోల్పోయిన భూనిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. మంచి నష్ట పరిహారం ఇచ్చాం. అన్ని విధాలా వారికి ప్రభుత్వం అండదండగా ఉంటుంది. భూ నిర్వాసితుల త్యాగాలు గుర్తు చేసుకోకుండా ఉండలేమని సీఎం స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అని సీఎం తెలిపారు. 165 టీఎంసీల కెపాసిటీతో కొత్త రిజర్వాయర్‌లు నిర్మించాం. ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఏ రాష్ట్రం కూడా నిర్మించలేదు. మూడు నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేశాం. లక్ష కోట్ల రూపాయాల పంటను తెలంగాణ రైతాంగం సంవత్సరానికి పండించబోతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు గురించి రాసిన జర్నలిస్టు మిత్రులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 48 డిగ్రీల టెంపరేచర్‌లో ప్రాజెక్టు కోసం పని చేసిన ఇతర రాష్ర్టాల కూలీలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని సీఎం తెలిపారు.