నన్నుల‌గ్గం చేసుకో కోట్లు తీసుకో బంప‌ర్ ఆఫ‌ర్

డెక్క‌న్ న్యూస్‌, క్రైమ్ బ్యూరో :
పెండ్లి చేసుకుంటే తనకున్న కోట్ల విలువైన ఆస్తులు నీకే వస్తాయంటూ.. ఓ ఎన్‌ఆర్‌ఐ నుంచి రూ.65లక్షలు వసూలు చేసిందో వివాహిత. బాధితుడి ఫిర్యాదుతో ఘరానా లేడీతోపాటు ఆమె కొడుకును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా మోకిలలోని వాటర్‌ఫోర్డ్‌ విల్లాలో నివాసం ఉంటున్న దేవటి శ్రీనివాస్‌, దేవటి మాళవిక అలియాస్‌ కీర్తి మాధవనేని(44)దంపతులకు ప్రణవ్‌(22)కొడుకున్నాడు. పెద్దఎత్తున అప్పులు కావడంతో ఓ ఎన్‌ఆర్‌ఐని పెండ్లి సంబంధం పేరుతో మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మాళవిక తన పేరు కీర్తి మాధవనేని అంటూ ఓ వెబ్‌సైట్‌లో పెండ్లి సం బంధం కోసం యాడ్‌ పెట్టింది.
తాను డాక్టర్‌ను అని జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో నివాసం ఉంటున్నానని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని నమ్మించింది. దీన్ని నమ్మిన అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వరుణ్‌ అనే యువకుడు ఆమెకు కాల్‌ చేశాడు. తన తండ్రి చనిపోవడంతో తల్లి తనను చిత్రహింసలు పెడుతున్నదని, తనపేరుతో ఉన్న ఆస్తులను ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఒత్తిడి చేస్తుందని నమ్మించింది. తనకు పెండ్లి అయిన వెంటనే ఆస్తులపై చట్టపరమైన హక్కు లు వస్తాయని, అప్పటిదాకా న్యాయపోరాటం చేసేందుకు డబ్బులు కావాలని చెప్పింది. ‘పెండ్లి అయిన తర్వాత నాఆస్తి మొత్తం నీదే..’ అంటూ నమ్మించడంతో పలు సందర్భాల్లో రూ.65లక్షలను ఆమె సూచించిన అకౌంట్లకు పంపించాడు.
ఆ తర్వాత మాళవిక ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఇటీవల నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా మాళవిక ఇదే పేరుతో ఓ ఎన్‌ఆర్‌ఐని మోసం చేసింది. నల్లకుండ, మారేడ్‌పల్లి తదితర పీఎస్‌ల పరిధిలో కూడా వీరు ఇదే తరహా మోసాలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు మాళవిక దేవటి, ఆమె కొడుకు ప్రణవ్‌లను గురువారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు శ్రీనివాస్‌ పరారీలో ఉన్నాడు.