ప‌డుకుంద‌ని అనుకొని తల్లి శవాన్ని లాగిన పసిపాప

అభం శుభం తెలియ‌ని వ‌య‌సు, ఎవ‌రిని ఎలా పిల‌వాలో కూడా అర్ధం వ‌య‌సు. కానీ అమ్మ ప్రేమ‌ను కాద‌న‌లేక పోయింది ఆ వ‌య‌సు. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు వారు.. బుక్కెడు బువ్వ కోసం.. గుక్కెడు నీళ్ల కోసం.. వలస కార్మికులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. లాక్‌డౌన్‌తో వలస కార్మికుల జీవితాలు ఆవిరైపోతున్నాయి. కొందరు తిండి లేక ఆకలితో అలమటించి కన్నుమూస్తున్నారు. మరికొందరు నిప్పులు కక్కే ఎండలో నడిచి నీరసించి పోయి చనిపోతున్నారు.
ఓ తల్లి ఆకలితో అలమటించి.. నీరసించి పోయి కన్నుమూసింది. ఆమె తన పసిబిడ్డను ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఏమీ తెలియని అమాయక పాలబుగ్గల పసిపాప.. ప్రాణాలు విడిచిన అమ్మను లేపేందుకు ప్రయత్నం చేసింది. అమ్మపై ఉన్న దుప్పటిని తీస్తూ.. లే అమ్మా అంటూ అటు ఇటు చూస్తోంది. కానీ తన తల్లి ప్రాణాలు విడిచిందని ఆ అమాయకపు పసిబిడ్డకు ఏం తెలుసు? నోట మాట రాని ఆ పసిపాపకు దిక్కేవరు? ఇలాంటి ఆకలి చావులు లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఎన్నెన్నో చూస్తున్నాం.
బీహార్‌కు చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం గుజరాత్‌కు వలస వెళ్లింది. లాక్‌డౌన్‌తో ఆమెకు ఉపాధి కరువైంది. దీంతో సొంతూరికి రావాలని నిర్ణయించుకుంది ఆమె. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైల్లో శనివారం గుజరాత్‌ నుంచి బయల్దేరింది. సోమవారం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌కు శ్రామిక్‌ రైలు చేరుకుంది. రైల్లో నుంచి సదరు మహిళ దిగి ప్లాట్‌ఫాం పైనే కుప్పకూలిపోయింది. మహిళ శ్వాస విడిచింది.
ఆహారం, నీరు లేకనే ఆమె నీరసించి పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రైల్లోనే ఆమె నీరసంగా ఉందని, రైలు దిగగానే చనిపోయిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను బంధువులకు అప్పగించారు పోలీసులు.