జమ్ము కాశ్మీర్‌లో అవి ఎక్కువ చేస్తున్నారు అంటా
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచిస్తున్న మంత్రం ట్రేస్.. టెస్ట్.. ట్రీట్! ఈ పద్ధతి ద్వారా కరోనా వైరస్ సోకిన వారిని వేగంగా గుర్తించి టెస్టులు చేసి వైద్యం అందించడంతో ఇతరులకు వైరస్ అంటుకోకుండా కాపాడుకోవచ్చు. దీంతో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భారీ సంఖ్యలో టెస్టులు చేస్తూ కరోనా కట్టడికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల్లో జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం సరికొత్త రికార్డు సృష్టించింది. అక్కడి జనాభాలో ప్రతి పది లక్షల మందికి గానూ 10 వేల మందికి పరీక్షలు చేసి.. పర్ మిలియన్ టెస్టుల్లో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.
పది వారాల్లో..
జమ్ము కశ్మీర్ లో పది వారాల క్రితం కరోనా కేసుల ట్రేసింగ్, టెస్టింగ్ మొదలుపెట్టినట్లు చెప్పారు జమ్ము కశ్మీర్ సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి. ఈ 70 రోజుల సమయంలో లక్షా 30 వేల టెస్టులు చేశామన్నారు. ప్రతి పది లక్షల మందిలో 10 వేల మందికి పైగా టెస్టులు చేశామని, దేశంలోనే పర్ మిలియన్ పాపులేషన్ టెస్టింగ్ రేట్ లో ఇదే అత్యధికమని ఆయన తెలిపారు. కాగా, సోమవారం వరకు జమ్ము కశ్మీర్ లో 1621 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 21 మంది మరణించగా.. 809 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.