ఐ పీ ఆర్ ఎస్ సభ్యులకు మరో విడత అదనపు సాయాన్ని విడుదల చేసిన సొసైటీ


~ సంగీత రంగానికి చెందిన 3500 కళాకారాలు, కంపోజర్లకు చేయూతనివ్వనున్న నిధి ~

ప్రపంచమంతా లాక్‌డౌన్‌ విధించుకొని కొవిడ్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్న వేళ కళారూపంగా సంగీతం విశ్వవ్యాప్తంగా లక్షలాది మందికి సాంత్వన చేకూర్చుతోంది. అది జాజ్‌ కావచ్చు లేదా రాక్‌, పాప్‌, క్లాసికల్‌, ఫోక్‌ లేదా దేశీయం రూపం ఏదైనా కావచ్చు సంగీతం అనేది మనుషులను, సమూహాలను ఒక్క చోటికి చేర్చి సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా తల్లడిల్లుతున్న వారికి ఈ కష్టకాలంలో సానుకూలమైన ఉపశమనం అందిస్తోంది. దురదృష్టవశాత్తు, అందరిలో ఆనందాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్న సంగీత ప్రపంచం కూడా మహమ్మారి బారిన పడింది.
లాక్‌డౌన్‌ తొలి దశలో వేలాది మంది కళాకారులు, కంపోజర్ల ప్రాథమిక అవసరాలుతీర్చేందుకు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీని ది ఇండియన్‌ పర్ఫామింగ్‌ రైట్‌ సొసైటీ లిమిటెడ్‌ (“IPRS”) ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ IPRS తన సభ్యుల కోసం మరోసారి అత్యవసర అదనపు సాయాన్ని విడుదల చేసింది. కొవిడ్‌ 19 కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సంగీత ప్రపంచంలోని 3500 కళాకారులు, కంపోజర్లకు ఈ నిధి చేయూతను అందిస్తుంది. ఈ సహాయనిధిని అత్యవసర ప్రతిపాదికన పంపిణీ చేసేందుకు IPRS అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.
“సృజనాత్మక సంగీత రంగం ఎదిగి, అభివృద్ధి చెందేలా సాయపడే లక్ష్యంతో IPRSను నెలకొల్పడం జరిగింది. ఈ విపత్కర సమయంలో మన సమాజం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న వేళ మన లక్ష్యాన్ని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్‌ 2020లో అందించిన తొలి ఆర్థిక సహాయ ప్యాకేజీ మన సమాజానికి ఎంతో ఉపశమనాన్ని అందించింది. ఇప్పుడు విడుదల చేస్తున్న అదనపు మొత్తం ఈ కష్టకాలంలో వారికి ఇంకొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సంక్షోభ సమయంలో తమకు తోచిన మేరకు ఇతరులకు సాయపడేందుకు అంతా ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కష్టకాలంలో మనమంతా ఐక్యంగా నిల్చొని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటే మానవత్వం నిలుస్తుందని” అన్నారు IPRS ఛైర్మన్‌ జావేద్‌ అక్తర్‌.

“IPRS బోర్డులో దక్షిణాది నుంచి ఉన్న మొదటి, ఏకైక లేబుల్‌ మాది. దక్షిణాదికి చెందిన కళాకారులు, కంపోజర్లకు రావాల్సిన సరైన రాయల్టీలు దక్కేలా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం” అన్నారు IPRS బోర్డు సభ్యులు, ఆదిత్య మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆదిత్య గుప్తా.

“ఈ సంక్షోభం మనందరికీ ఎంతో కష్టాన్ని కలిగిస్తోంది. ఈ విపత్కర సమయంలో సంగీత కళాకారులు, కంపోజర్లను ఆదుకునేందుకు IPRS ముందుకు రావడం దక్షిణ భారత సంగీత రంగం ఎంతో గర్వంగా భావిస్తోంది. ఈ కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా ఉంటూ మన సమాజాన్ని చూసుకోవాలి. ఈ గొప్ప చర్యలో భాగస్వామిగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అన్నారు IPRS బోర్డు సభ్యులు, కంపోజర్‌, సంగీత దర్శకుడు U.విద్యాసాగర్‌.
“ఇది మనందరికీ పరీక్షా సమయం, ఈ మహమ్మారి అన్ని రంగాల్లో ఆర్థిక అస్థిరతను సృష్టించింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు IPRS ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మానవత్వంతో చేస్తున్న ఈ చర్య మనందరికీ ఏళ్లపాటు గుర్తుండిపోతుంది” అన్నారు IPRS బోర్డు సభ్యులు, గేయ రచయిత సాహిత్‌ చెరుకుపల్లి.
ఈ సందర్భంగా IPRS సీఈఓ రాకేశ్‌ నిగమ్‌ మాట్లాడుతూ, “బాధ్యతాయుత కాపీరైట్‌ సొసైటీగా సాధ్యమైన రీతిలో సంగీత రంగానికి చేయూత అందించడం మన బాధ్యత. ఉపాధి లేక ఆదాయాన్ని కోల్పోయిన ఈ సమయంలో మన సభ్యులకు కొంత ఆదాయం అందించేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం” అన్నారు.