కరోనకి ఆ మందే బెటర్ : ట్రంప్

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో … నిండు చంద్రుడు ఒకవైపు నేను ఒక్కడిని ఒక వైపు అనేది ఒక సినిమా పాట. అచ్చం అలాగే ఉంటాడు మన అగ్ర రాజ్య అద్యక్షడు ట్రంప్. కరోనా కట్టడి కోసం ప్రపంచం వాక్సిన్ తీసుకరావాలని చూస్తోంది. అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. కరోనా వైరస్‌ నుంచి రక్షణ కోసం మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకున్నారు. రెండు వారాలుగా తాను ఈ మందును తీసుకుంటున్నట్లు ట్రంప్‌ సోమవారం చెప్పడం తెల్సిందే. మరికొంత కాలం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటానని, అది సురక్షితమైందని కరోనా వైరస్‌ ఎదుర్కొనే మేలైన మార్గమని మంగళవారం ఆయన పునరుద్ఘాటించారు. ‘అది చాలా శక్తిమంతమైన మందు. మీకు హాని కలిగించదు. కాబట్టి దాన్ని కరోనా చికిత్సకు వాడాలని అనుకున్నా’ అని విలేకరులతో చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది వైద్యులు ఈ మందును ప్రశంసించారని, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ తదితర దేశాల్లో గొప్ప అధ్యయనాలు జరిగాయని అమెరికాలోనూ పలువురు వైద్యులు ఈ మందుపై సానుకూలంగా వ్యవహరించారని ట్రంప్‌ వివరించారు. మరణం ముంగిట్లో ఉన్నవారికి ఈ మందు ఇచ్చి అది పనిచేయలేదని కొంతమంది ఒక అధ్యయనం ద్వారా చెప్పారని వాళ్లు తమ శ్రేయోభిలాషులు కాదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.