వరి వద్దు పత్తే ముద్దు

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. వర్షాకాలంలో మక్కల సాగు ఏమాత్రం లాభసాటి కాదని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పత్తి సాగు శ్రేయస్కకరమని వారు తేల్చి చెప్పారు. తెలంగాణలో వానాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కందులు వేయడం మంచిదని వారు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో సిఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగ నిపుణులు పలు సూచనలు చేశారు. తెలంగాణలో సాగుభూమి, సాగు పద్ధతులు, దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లను అధ్యయనం చేసిన అనంతరం వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
వారు చేసిన ముఖ్యమైన సూచనలు ఈ విధంగా ఉన్నాయి:
-ఈ సారి కరోనా ఉంది కాబట్టి రైతులు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేసింది. కానీ ప్రతీ సారి ఈ పరిస్థితి ఉండదు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలి.
-వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి ఈ 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రైతుకు ధర రాదు. ఈ 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 35 లక్షల ఎకరాలు సాగు చేయాలి. 65 నుండి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయండి
-వరితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. తెలంగాణలో గతంలో పత్తి పంటను వర్షాల మీద ఆధారపడి సాగు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగింది. కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం. పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి, రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.
-కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి తెలంగాణలో వర్షాకాలం పంటగా కందులను 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఉత్తమం.
-వర్షాకాలంలో మక్కలు అసలు పండించకపోవడం చాలా ఉత్తమం. వర్షాకాలం మక్కల దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో మక్కల దిగుబడి 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు ఉంటుంది. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దు. మక్కలకు మార్కెట్లో డిమాండ్ కూడా అంతగా లేదు కాబట్టి, తెలంగాణ అవసరాలకు తగినట్టు యాసంగిలో మాత్రమే సాగు చేసుకోవడం మంచిది. రైతులు ఎవరైనా తమ సొంత అవసరాల కోసం వర్షాకాలంలో మక్కలు పండించుకోవడం వారి వ్యక్తిగతం, కానీ వ్యాపార పంటగా మక్కలు సాగు చేయడం మాత్రం మంచిది కాదు.
పై సూచనలపై ప్రభుత్వం రాబోయే రెండు రోజుల పాటు చర్చిస్తుంది. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. అనంతరం సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. అటు రైస్ మిల్లర్లతో చర్చలు అసమగ్రంగా ఉండడం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే విషయంలో తుది నిర్ణయం జరగని కారణంగా శుక్రవారం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్సు ఈ నెల 18కి వాయిదా పడింది. 18వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఎడిఎ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఎఇవోలు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు, గ్రామాల రైతు బంధు సమితిల అధ్యక్షులు పాల్గొంటారు.
-ఇదిలా ఉండగా, రాష్ట్రంలో అమలు చేయాల్సిన వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా జరుపుతున్న చర్చలు శుక్రవారం కూడా కొనసాగాయి. మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిభాయి, సిఎంవో కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.