జూన్‌ 3న తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంచెం కుదుట పడిన నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలను నిర్వహించడానికి సంబంధిత బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన రెండు (జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజ్‌) ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తేదీలను కూడా ప్రకటించింది. జూన్‌ 3న ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజ్‌ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. పాత హాల్‌టికెట్లతోనే.. గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 23న జరగాల్సి ఉండగా కరోనా, లాక్‌డౌన్‌తో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. 856 మంది ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు రెండు పరీక్షలు మిగిలిపోయాయని వాటి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఇటీవల తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. పదో తరగతికి సంబంధించిన 8 పరీక్షల నిర్వహణ కోసం కోర్టు అనుమతి తప్పనిసరి అని, అందుకు కోర్టుకు అఫిడవిడ్‌ దాఖలు చేస్తామని కూడా ఆమె తెలిపారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు