ఎస్‌బీఐలో వేతన ఖాతాలు కలిగిన వారికి పర్సనల్ లోన్స్
తమ ఖాతా దారులకు పర్సనల్ లోన్స్ అందజేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బ్యాంకులో ఖాతా కలిగిన వారికి పర్సనల్ లోన్స్ అందించబోతున్నామని బ్యాంకు అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం ఎస్‌బీఐ ‘యోనో’ యాప్ ద్వారా జూన్ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. కనిష్టంగా రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఈ పథకం ద్వారా రుణాలు పొందవచ్చని, 18 వాయిదాల్లో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ అధికారులు వెల్లడించారు. అయితే, ఎస్‌బీఐలో వేతన ఖాతాలు కలిగిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని బ్యాంకు ప్రకటనలో పేర్కొన్నారు.











