అమెరికాను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్
ఇప్పటికే కరోనా వైరస్‌తో కోలుకోలేని దెబ్బ పడిన అగ్రరాజ్యం అమెరికాలో మరో మాయదారి రోగం కాలు మోపింది. చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపే ఓ అంతుచిక్కని వ్యాధి న్యూయార్క్ నగరంలో కలకలం రేపుతున్నది. ఇప్పటికే న్యూయార్క్ వ్యాప్తంగా 100 మందికిపైగా పిల్లలు ఈ వ్యాధి బారినపడ్డారు. వ్యాధి లక్షణాలు ముదరడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పిల్లల్లో కరోనా సోకిన ఆరు వారాల తర్వాత ఈ అంతుచిక్కని వ్యాధి లక్షణాలను గమనించినట్లు న్యూయార్క్ ఆరోగ్య విభాగం అధికారులు వెల్లడించారు.
ఈ వ్యాధి లక్షణాలు కవాసాకీ డిసీజ్ లేదా టాక్సిక్ షాక్ లక్షణాలను పోలి ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో జ్వరం, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకురావాలని, పరిస్థితి విషమిస్తే పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 15 నుంచి 19 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారిలో 16 శాతం కేసులు నమోదవుతున్నాయని న్యూయార్క్ అధికారులు వెల్లడించారు.