సడలింపులు మన చావుకేనా ?

దేశంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇతర దేశాలు సైతం మన భారత దేశాన్ని పొగిడాయి. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉత్తర్వులతో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలతోపాటు అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. కేసులు తక్కువగా ఉన్నపుడు కఠినంగా వ్యవహరించి.. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న వేళ వైరస్‌ను తక్కువ అంచనా వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించినప్పుడు ప్రభుత్వం భయంగొలిపే ప్రకటనలు చేసింది. వైరస్‌ సోకినా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పి మార్చి 24వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ విధించింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకరికి పాజిటివ్‌గా తేలితే ఆ వీధి మొత్తం సీలువేసి రెడ్‌జోన్‌గా ప్రకటించారు. వీధిలోని వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. కేసు బయటపడిన ఐదు కిలోమీటర్ల పరిధిలో అందరికీ వైద్యపరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించారు. వైరస్‌ లక్షణాలున్నవారు ఆసుపత్రిలో 14 రోజులు, హోం క్వారంటైన్‌లో 14 రోజులు ఉండాలని చెప్పారు. పాజిటివ్‌ కేసులు పెరిగే కొద్దీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మారుస్తూ వస్తోంది. పాజిటివ్‌ కేసు బయటపడిన వారి ఇంటిని మాత్రమే కట్టడి చేస్తామని..వీధులకు సీలు వేయబోమని తెలిపింది. కుటుంబ సభ్యులకు మాత్రమే పరీక్షలు చేస్తామని చెబుతోంది. ఇంటివద్దనే భౌతికదూరం పాటిస్తూ చికిత్సపొందాలని ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా ఉండేవి. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న వేళ సడలింపులు పెరిగిపోతున్నాయి. ఇలా వైరస్‌ విలయతాండవం ఆడుతున్న వేళ పాత ఉత్తర్వుల్లో మార్పులు, లాక్‌డౌన్‌ సడలింపులతో అంతా ఆయోమయంలో పడిపోతున్నారు.