వైద్య ఖర్చులు నేనే భరిస్తా – ఎమ్మెల్యే రజిని
సోషల్ మీడియాలో వార్త చూసి స్పందించిన ఎమ్మెల్యే
ఆస్పత్రికి స్వయంగా వెళ్లి పరామర్శించిన వైనం
ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం కాకుమానుకు చెందిన పుత్తూరు రామకృష్ణ అనే వ్యక్తి నాలుగు రోజుల కిందట చిలకలూరిపేట సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాలికి తీవ్ర గాయమైంది. పట్టణంలోని ఆర్కే ఆస్పత్రికి బాధితుడిని తీసుకొచ్చారు. అతడికి సర్జరీ అవసరమైంది. పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. రామకృష్ణది నిరుపేద కుటుంబం. వైద్యం కోసం అంత డబ్బు ఖర్చు చేసే స్థోమత వారికి లేదు. కుటుంబ పెద్దకు కష్టం రావడంతో ఏం చేయాలో తెలియని రామకృష్ణ కుమారుడు నాగార్జున తమను ఆదుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. అది గమనించిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు వెంటనే స్పందించారు. మానవత్వంతో ముందుకు వచ్చారు. ఆస్పత్రికి తానే స్వయంగా మంగళవారం వెళ్లారు. అధైర్య పడొద్దని, తాను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆస్పత్రి అధినేత రామకృష్ణతో వైద్య ఖర్చులు తాను భరిస్తానని చెప్పారు. బాధితుడు రామకృష్ణను ఇంటికి పంపేటప్పుడు తనకు సమాచారం ఇస్తే, వైద్య ఖర్చులు తన మనుషులు వచ్చి చెల్లిస్తారని తెలిపారు. ఈ సంఘటనతో బాధిత కుటుంబం ఎంతో సంతోషం వ్యక్తంచేసింది. ఆపద సమయంలో ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. జీవితాంతం రుణపడి ఉంటామంటూ రామృక్రిష్ణ భార్య ఎమ్మెల్యే గారితో చెబుతూ ఆనందం వ్యక్తంచేసింది.