చిన్న రిటైల్ వ్యాపారులకు అన్యాయం చేయడమే
ఈ-కామర్స్ విక్రయాలకు అనుమతిపై కాంగ్రెస్
లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఈ నెల 20 నుంచి ఈ- కామర్స్ సంస్థలకు ఆయా వస్తువుల విక్రయాలు చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం.. రిటైల్ వ్యాపారులకు అన్యాయం చేయడం లాంటిదేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రిటైల్ వ్యాపార రంగానికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. అలాగే ఆన్‌లైన్ అమ్మకాలకు మార్గదర్శకాలను జారీ చేయాలని పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ కేంద్ర హోంశాఖను డిమాండ్ చేశారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ‘ఒకవైపు రిటైల్ దుకాణాలు మూసి ఉండగా.. అదే సమయంలో ఆన్‌లైన్ సంస్థలు తమ అమ్మకాలు కొనసాగిస్తాయి. ఇది చిన్న వ్యాపారులకు అన్యాయం చేయడమే. ప్రభుత్వం ఇందుకు అనుమతించకూడదు. ఇప్పటికే పెద్దనోట్ల రద్దు, ఆన్‌లైన్ వ్యాపారాలతో రిటైల్ రంగం కుదేలయిందన్నారు. రిటైల్ రంగంపై దేశవ్యాప్తంగా 2.72 కోట్ల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని.. ప్రస్తుత తరుణంలో చిన్న దుకాణాలను ఆదుకోవాలని కోరారు.