విమానంలో మల్లెపూలు తీసుకెళ్లి బుక్కైంది
గుడులకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పూలు పెట్టుకోవడం, వెంట తీసుకెళ్లడం అందరూ చేసే పనే. కానీ ఇదే పని చేసిన ఓ నటికి గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా ఆమె ఓ మూరెడు మల్లెపూల దండ వెంట తీసుకెళ్లినందుకే ఆమెకు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఇది తప్పని తనకు తెలియదని చెప్పినా పట్టించుకోకుండా వెంటనే డబ్బులు చెల్లించమంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె డబ్బులు చెల్లించగా.. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. మూరెడు మల్లెపూల కోసం లక్ష రూపాయల జరిమానా ఏంట్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తిరువోణం పండుగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు మలయాళ నటి నవ్య నాయర్ అక్కడికి వెళ్లారు. ఆమె తనతో పాటు 15 సెంటీ మీటర్ల మల్లెపూల దండను వెంట తీసుకెళ్లారు. కానీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు ఆమె వద్ద ఉన్న పూల దండను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు ఇతర దేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, పూలు, ఆహార పదార్థాలు వంటి వాటిని తీసుకురావడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయని చెబుతూ.. జరిమానా విధించారు.
ముఖ్యంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు 1,980 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.1.14 లక్షలు) జరిమానా విధించారు. అధికారుల నోట ఈ మాట విన్న నవ్య నాయర్ షాక్ అయ్యారు. తనకు ఈ విషయం తెలయదని చెబుతూనే.. తన తండ్రి ఎంతో ప్రేమగా కొనివ్వడం వల్లే ఈ మల్లెపూలు వెంట తీసుకు వచ్చినట్లు వివరించారు. అయినా చేసింది తప్పే కాబట్టి జరిమానా చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక నవ్య నాయర్ అధికారులు చెప్పిన మొత్తాన్ని చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సంఘటన తర్వాత నవ్య నాయర్ ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తప్పును అంగీకరించారు. తనకు నిజంగానే ఆ నిబంధనల గురించి తెలియదని చెప్పారు. అయితే ఇది సాకు కాదని వివరణ ఇచ్చారు. అలాగే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఆ దేశ నియమ నిబంధనలను తెలుసుకొని పాటించాలని సూచించారు. అంతేకాదండోయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తనను తానే ఆట పట్టించుకున్నారు. ఇలా ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ అయింది.
అసలు పూలు ఎందుకు తీసుకెళ్లకూడదు..?
ఆస్ట్రేలియా దేశ ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను బయటి నుంచి వచ్చే చీడ పురుగులు, వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి అక్కడి అధికారులు ఈ చర్యలు తీసుకుంటారు. అందుకే పూలు, విత్తనాలు, మొక్కలు వంటి వాటిపై నిషేధం విధించారు.











