లిటిల్ స్టార్ & షి హాస్పిటల్ లో చిన్నారికి పునర్జన్మ
మన శరీరంలో సాధారణంగా గుండె భాగానికి, ఉదర భాగానికి మధ్య ఒక గోడ లాంటిది ఉంటుంది. దాన్ని డయాఫ్రం అంటారు. దానివల్ల ఉదరభాగంలో ఉండే కాలేయం, మూత్రపిండాలు, కడుపు, పేగులు లాంటివి పైన గుండె భాగంలోకి రాకుండా ఉంటాయి. కానీ, సౌదీ అరేబియాలో ఉంటున్న ఒక జంటకు పుట్టిన శిశువుకు.. అసలు పుట్టుకతోనే డయాఫ్రం ఏర్పడలేదు. దానివల్ల కడుపు, కాలేయం, మూత్రపిండాలు అన్నీ గుండె భాగంలోకి వచ్చేశాయి. ఇంత సంక్లిష్టమైన కేసును కేవలం కీహోల్ సర్జరీ మాత్రమే చేసి.. శిశువు ప్రాణాలను హైదరాబాద్లోని బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు కాపాడారు. ఇందకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన ప్రముఖ సీనియర్ నియోనటాలజిస్ట్ డాక్టర్ సతీష్ గంట విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
“సౌదీ అరేబియాలో ఉంటున్న జంట డెలివరీ కోసం భారతదేశానికి వచ్చారు. మొదట నగరంలోని వేరే హాస్పిటల్ లో వివిధ పరీక్షలు చేసిన తర్వాత శిశువుకు ఈ సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. చివరకు లిటిల్ స్టార్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేసి, ముందుగా ప్రసవం చేసిన తర్వాత… శిశువు పుట్టిన నాలుగోరోజున శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం.
మామూలుగా అయితే ఇలా కడుపు కూడా గుండె భాగంలోకి వెళ్లిపోతే చాలావరకు శిశువులు చనిపోతారు. ఊపిరితిత్తులు ఉండాల్సిన చోట ఉండకుండా పక్కకు జరగడంతో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.
పైగా.. ఇలాంటి శస్త్రచికిత్సలను సాధారణంగా ఓపెన్ పద్ధతిలో.. అంటే కోసి చేస్తారు. కానీ, శిశువు వయసు దృష్ట్యా, అత్యంత సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను కూడా మేం కీహోల్ పద్ధతిలోనే చేశాం. దాని ద్వారా ముందుగా వేర్వేరు ప్రదేశాలలో ఉన్న కీలక అవయవాలైన మూత్రపిండాలు, కాలేయం, కడుపు లాంటివాటిని వాటి వాటి స్థానాల్లోకి ప్రవేశపెట్టాం. తర్వాత అవి మళ్లీ పైకి రాకుండా కృత్రిమ డయాఫ్రంను ఏర్పాటుచేశాం. తద్వారా.. శిశువు ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా కాపాడగలిగాం. ఇలాంటి పరిస్థిత్తుల్లో శిశువును దాదాపు మూడు లేదా నాలుగు నెలల పాటు హాస్పిటల్స్ ఉంచాల్సిన పరిస్థితి ఉండేది కానీ… అన్ని విధాలా శిశువును బాగు చేసి మేము మూడున్నర వారల్లోనే డిశార్జి చేసి పంపుతున్నాం.
ఇలాంటి సమస్య రావడమే చాలా అరుదుగా ఉంటుంది. పైగా, ఇలాంటప్పుడు చాలావరకు ఓపెన్ పద్ధతిలోనే శస్త్రచికిత్సలు చేస్తారు. దానివల్ల రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. అందుకని ఇక్కడ ఈ కేసులో శిశువు ప్రాణాలను కాపాడాలని.. అందులోనూ వీలైనంత తక్కువగా రక్తస్రావం ఉండేలా చూడాలని భావించి మేం కీహోల్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేశాం” అని డాక్టర్ సతీష్ గంట తెలిపారు.
ఆస్పత్రికి.. వైద్యులకు కృతజ్ఞతలు
“మా శిశువుకు ఇంత పెద్ద సమస్య ఉందని తెలిసి పైప్రాణాలు పైనే పోయాయి. దీనికి అసలు చికిత్స ఉందా, ఉంటే ఎవరు చేస్తారని పలు రకాలుగా ప్రయత్నించాం. చివరకు బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్స్ అండ్ షి ఆస్పత్రి గురించి తెలిసి ఇక్కడకు వచ్చాం. ఇక్కడి వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఎంతో బాగా శస్త్రచికిత్స చేశారు. పెద్ద పెద్ద కోతలు లేకుండా మూడు చిన్న రంధ్రాలు చేసి, దాంట్లోంచే అంతా నయం చేసేశారు. మా బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులకు, లిటిల్ స్టార్స్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రి యాజమాన్యానికి, ఇక్కడి వైద్యబృందానికి, సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము” అని శిశువు తండ్రి చెప్పారు.