కలవరపెడుతున్న ఊబకాయం

మితిమీరిన ఆహార‌పు అల‌వాట్ల‌నే ఊబ‌కాయం వస్తుంది. ప్ర‌పంచంలో దీని వ‌ల్ల అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన పెంచ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 4వ తేదీన అంతర్జాతీయ ఊబ‌కాయ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు.
ఇటీవ‌ల వ‌చ్చిన నివేదిక‌ల ప్ర‌కారం 2020 నాటికి ప్ర‌తి ప‌ది మందిలో ఇద్ద‌రు, 2030 వ‌చ్చేనాటికి ప్ర‌తి ప‌దిమందిలో 5గురు ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతారు అనే వివిధ స‌ర్వేలు చెబుతున్నాయి.
మారుతున్న జీవ‌న శైలిలో భాగంగా స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌లేక జంక్‌ ఫుడ్ల వల్ల శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే ఒక వ్యాధినే ఊబకాయంగా పిలుస్తారు. దీనినే స్థూలకాయం అని కూడా అంటారు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ధూమపాన వ్యసనం, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా దీనిబారిన పడొచ్చు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే దీనిని అనారోగ్య సమస్యగా గుర్తించ‌వ‌చ్చు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం (గురక), కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన కేన్సర్‌ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

శరీరంలో అధిక కొవ్వు పెరగడం అంతిమంగా హృదయంపై ప్రభావం చూపనుంది. ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడవడం, పరిగెత్తడం ద్వారా కొవ్వు కరిగించ‌వ‌చ్చు.
జంక్‌ ఫుడ్‌ ప్రభావం
అధిక కేలరీలు కలిగి ఉండే ఆహారంగా చెప్పుకునే జంక్‌ఫుడ్‌ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. పెద్దల పరిస్థితీ అంతే. సాచ్యురేటెడ్‌ కొవ్వులు, ఉప్పు, పంచదార పాళ్లు మోతాదుకు మించి ఉండే చిరుతిళ్లు తినడం ప్రమాదకరం. అంటే బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేకులు, నూడిల్స్, చిప్స్, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్, ఫాస్ట్‌ ఫుడ్, కార్బొనేటెడ్‌ డ్రింక్స్, రెడిమేడ్‌ కూల్‌ డ్రింక్స్‌ లాంటివి జంక్‌ ఫుడ్‌గానే చెప్పొచ్చు. ఇంకా మసలా చాట్, పకోడీలు, బజ్జీలు, టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్‌ డింగ్‌–డాంగ్స్‌ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు.
మోతాదుకు మించి తినొద్దు
పిల్లలు టీవీ ముందు కూర్చొని చిరుతిళ్లు ఎక్కువగా తింటుంటారు. ఈ పద్ధతిని మాన్పించాలి. పెద్దలు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ ఖ‌చ్చితంగా ఉండాలి. 2030 నాటికి భార‌త‌దేశంలో 2.7 కోట్ల మంది పిల్ల‌ల్లో ఊబ‌కాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే కౌమ‌ర ద‌శ పైబ‌డిన వ‌య‌సుల వారు 5 కోట్ల మందికి ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతార‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.
మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఫైబర్‌ ఉన్న పదార్థాలు తినాలి. మాంసాహారం, ధూమపానం, మద్యపానం అలవాట్లు మానాలి.