తెలంగాణలో తొలిసారిగా స్థానికుడికి కరోనా వైరస్ సోకింది.
శనివారం (మార్చి 21) సాయంత్రం వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. వీటిలో 20 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారే కాగా.. తొలిసారిగా విదేశాల నుంచి వచ్చిన రోగి ద్వారా కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. మార్చి 14న దుబాయ్ నుంచి ఓ వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. మార్చి 19న అతడికి కరోనా సోకినట్లు ప్రభుత్వం (P14 కేసు) ప్రకటించింది.
తెలంగాణలో తొలిసారిగా స్థానికుడికి కరోనా వైరస్ సోకింది. కరోనా బారిన పడ్డ రోగి ద్వారా అతడికి ఈ వైరస్ సోకింది. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రెండో దశగా పేర్కొంటున్న ఈ తరహాలో రాష్ట్రంలో ఓ కేసు నమోదవడం ఇదే తొలిసారి. రోగితో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. క్రమంగా మూడో దశకు చేరి సమూహ వ్యాప్తి చెందుతుంది. అదే జరిగితే పరిస్థితి ఊహించలేం. చైనాలో, ప్రస్తుతం ఇటలీలో ఆందోళనకర పరిస్థితికి ఇదే కారణం.