జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు మళ్లీ ఈడీ సమన్లు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మళ్లీ సమన్లు జారీ చేసింది.జార్ఖండ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 17వతేదీన రాంచీలో హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 47 ఏళ్ల సీఎం సోరెన్‌ను కేంద్ర ఏజెన్సీ ఈడీ మొదట నవంబర్ 3వతేదీన విచారణకు పిలిచింది. అయితే అధికారిక కార్యక్రమాలను ఉటంకిస్తూ సీఎం సోరెన్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత సమన్లను మూడు వారాలపాటు వాయిదా వేయాలని సోరెన్ కోరారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ప్రశ్నించడానికి జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని తమ ప్రాంతీయ కార్యాలయంలో వచ్చే వారం 17 వతేదీన హాజరు కావాలని ఈడీ కోరింది.అక్రమ మైనింగ్ కేసులో సోరెన్ రాజకీయ సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు స్థానికులు బచ్చు యాదవ్, ప్రేమ్ ప్రకాష్‌లను ఈడీ అరెస్టు చేసింది.జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆదాయాన్ని గుర్తించినట్లు ఈడీ తెలిపింది.