లిగమెంట్ టేర్ అయిన యువకుడికి అమోర్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స
బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మోకాలిలో లిగమెంట్ టేర్ అయిన ఓ యువకుడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేసి ఊరట కల్పించారు. ఈ వివరాలను ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అభిలాష్ తెలిపారు.
“35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి.. ప్రమాదంలో గాయపడటంతో అతడికి మోకాలిలో ఉన్న ఏసీఎల్ (యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్) టేర్ అయ్యింది. సాధారణంగా అది మోకాలికి స్థిరత్వాన్ని అందిస్తుంది. గాయపడిన రెండురోజుల తర్వాత వచ్చిన ఆ యువకుడికి ముందుగా ఎంఆర్ఐ చేశాం. ఏసీఎల్ టేర్ అయినట్లు తెలియడంతో దాన్ని వినూత్న పద్ధతిలో బాగు చేయాలని నిర్ణయించాం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో అయితే రీకన్‌స్ట్రక్షన్ ఒక్కటే చేస్తాం. అంటే, వేరే చోటునుంచి లిగమెంట్ తీసుకుని దాన్ని ఇక్కడ పెడతాం. అందుకోసం తొడ ఎముక, కాలి ఎముకలో టన్నెల్ లాంటిది చేసి, గ్రాఫ్ట్ వేస్తాం. కానీ ఈ యువకుడి విషయంలో రిపేర్, రీకన్‌స్ట్రక్షన్ రెండూ చేశాం. అంటే, అక్కడ అప్పటికే ఉన్న లిగమెంటుకు కొంత మరమ్మతులు చేయడంతో పాటు వేరే చోటునుంచి లిగమెంట్ తెచ్చి, దానికి సపోర్టుగా పెట్టాం. మోకాలి లిగమెంట్లలో కొన్ని రిసెప్టార్లు ఉంటాయి. వాటివల్ల జాయింట్ పొజిషన్ తెలుస్తుంది. మోకాలిలో అప్పటికే ఉన్న లిగమెంటును తీసేసి గ్రాఫ్ట్ చేస్తే జాయింట్ పొజిషన్ సరిగా ఉండదు. దానివల్ల కాలిపై అదనపు భారం మోపాల్సి వచ్చి, మోకాలు త్వరగా అరిగిపోతుంది. అలాగని రిపేర్ ఒక్కటే చేస్తే విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ కేసులో రిపేర్, రీకన్‌స్ట్రక్షన్ రెండూ చేశాం. దీనివల్ల అదనపు బలం వచ్చి, మోకాలి జాయింటుకు పొజిషన్ సెన్స్ కూడా బాగా తెలుస్తుంది. ఫలితంగా రోగి చాలా త్వరగా కోలుకోగలిగాడు. ఈ తరహా శస్త్రచికిత్స ఇప్పటివరకు ఎవ్వరూ చేసినట్లు వైద్య పత్రికలలో ఎక్కడా ఇంతవరకు రాలేదు. ఇది పూర్తిగా కొత్త విధానం. దీనిపై మరింత పరిశోధన చేసి, వైద్య పత్రికలలో రాయాల్సి ఉంది” అని డాక్టర్ అభిలాష్ వివరించారు.