లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రో వికెట్‌

లిక్కర్ స్కాంలో అరెస్టైన అభిషేక్ బోయిన్పల్లిని కోర్టు 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్ లో అరెస్టు చేసిన అనంతరం ఢిల్లీకి తరలించిన అధికారులు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్ లోకి రూ.3.85కోట్లు వచ్చినట్లు గుర్తించామని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆ నగదు బదిలీకి సంబంధించి ఆయన ఎలాంటి పత్రాలు చూపలేదని చెప్పింది. రెండు మూడు ఖాతాల నుంచి వచ్చిన డబ్బును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాడని, ఆయనకు ఆ కంపెనీల్లో షేర్లు ఉన్నాయని విన్నవించింది. లిక్కర్ పాలసీ విషయంలోనూ అభిషేక్ వివిధ ప్రాంతాల్లో జరిగిన మీటింగ్ లకు హాజరైన విషయాన్ని సీబీఐ ప్రస్తావించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అభిషేక్ ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించాలని కోరింది. సీబీఐ వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్ కే నాగ్ పాల్ ఆయనను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇండోస్పిరిట్ అధినేత విజయ్ నాయర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసింది సీబీఐ. ఇవాళ బోయిన్ పల్లి అభిషేక్ రావు అరెస్ అయ్యాడు. ఇదే కేసులో సమీర్ మహింద్రును ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. అతని కస్టడీ ముగియడంతో సమీర్ మహింద్రును కూడా అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. సమీర్ మహింద్రుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. జైలులో అన్ని వసతులు కల్పించాలని కోర్టులో వాదించారు అతని లాయర్. దీంతో సమీర్ మహీంద్రును ఈ నెల 20వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు.

ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. మొదట ఢిల్లీ లిక్కర్ స్కాంపై మొత్తం 16మంది పేర్లతో కేసు నమోదు చేసింది సీబీఐ. దీనికి అనుబంధంగా లిక్కర్ స్కాంలో జరిగిన లావాదేవీలు, డబ్బులు చేతులు మారిన దానిపై ఈడీ విచారణ చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లింకులపై ఇప్పటికే రామచంద్రపిళ్లై, వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ విచారించింది.