గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ
డెక్కన్ న్యూస్, జమ్మూకాశ్మీర్ : దేశంలో మరో కొత్త రాజకీయ పార్టి పురుడు పోసుకుంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ సొంత పార్టీని స్థాపించారు. ఈ వివరాలను సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు. తన రాజకీయ పార్టీ పేరును ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’గా గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. మూడు రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించారు. మూడు రంగులు నిలువుగా ఉన్న ఆ జెండాలో మొదటి రంగు నీలం. మధ్యలో తెలుపు రంగు. మూడో రంగు పసుపు. తన పార్టీ జెండాను అలా డిజైన్ చేయడానికి కారణాన్ని కూడా గులాం నబీ ఆజాద్ వివరించారు. పసుపు రంగు కొత్తదనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని.. తెలుపు శాంతికి చిహ్నమని, నీలం స్వేచ్ఛకు.. సంద్రంలోని లోతుకు.. అందనంత ఎత్తులో ఉండే ఆకాశ వర్ణానికి చిహ్నమని ఆయన చెప్పుకొచ్చారు.
అధ్యక్ష ఎన్నికల ముంగిట..
సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ (73).. ఆ పార్టీతో 52 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న సంగతి తెలిసిందే. పార్టీలో ప్రస్తుత పరిణామాలను, అగ్ర నేత రాహుల్‌గాంధీని తీవ్రంగా విమర్శిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ కూడా రాశారు. ఆయనకు పరిపక్వత లేదని.. ఆయన పిల్లచేష్టలతో కాంగ్రెస్ పూర్తిగా నాశనమైపోయిందని వాపోయారు. వందిమాగధులు, రాహుల్ అంగరక్షకులు, పీఏలే ప్రస్తుతం దానిని నడుపుతున్నారని.. తనలాంటి అనుభవజ్ఞులను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని దుయ్యబట్టారు. కోటరీ కనుసన్నల్లో పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయని.. ఫలితంగా దేశహితం కోసం పోరాడే సంకల్పం, సామర్థ్యం రెంటినీ పార్టీ కోల్పోయిందన్నారు. ‘రిమోట్ కంట్రోల్ మోడల్’తో యూపీఏ ప్రభుత్వ సమగ్రతను.. ఇప్పుడు కాంగ్రెస్‌ను సర్వనాశనం చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాలను రాహుల్, ఆయన అంగరక్షకులు, పీఏలు తీసుకుంటున్నారని ఆక్షేపించారు. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళించాలని.. సమష్టి నాయకత్వం తీసుకురావాలని పట్టుబట్టిన జి-23 గ్రూపు నేతల్లో ఆజాద్ కీలక వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.
అంతేకాదు.. తన రాజీనామా లేఖలో రాహుల్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ‘రాహుల్ రాజకీయాల్లోకి ప్రవేశించాక.. మరీ ముఖ్యంగా 2013 జనవరిలో ఆయన్ను మీరు (సోనియా) పార్టీ ఉపాధ్యక్షుడిని చేశాక.. పార్టీలో అప్పటిదాకా ఉన్న సంప్రదింపుల విధానాన్ని ఆయన తుంగలో తొక్కారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నేతలను పక్కనపెట్టారు. ఏ మాత్రం అనుభవం లేని భజనపరులు, వందిమాగధులతో కూడిన కొత్త కోటరీ వచ్చింది. ఈ కోటరీ ఆదేశాలతోనే జమ్ములో నా శవయాత్ర చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించి ఇలాంటి పనిచేసిన వారితో కలిసి రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఢిల్లీలో పండుగ చేసుకున్నారు’ అని తప్పుబట్టారు. పార్టీ అగాధంలో కూరుకుపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పార్టీ మేలు కోసం సమష్టి నాయకత్వం కావాలని తాను, మరో 22 మంది పార్టీ నేతలు (జి-23) సోనియాకు లేఖ రాస్తే.. భజనపరులను కోటరీ తమపైకి ఉసిగొల్పిందని.. వారు తమపై దాడులు చేశారని.. అ డుగడుగునా అవమానించారని.. దూషించారని బాధపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వ తీరుకు నిరసనగా ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, ఆర్‌పీఎన్ సింగ్, కెప్టెన్ అమరీందర్‌సింగ్, సునీల్ జాఖడ్, హార్దిక్ పటేల్, కపిల్ సిబ్బల్, అశ్వినీకుమార్, జైవీర్ షెర్గిల్ వంటి సీనియర్ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే..