బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేస్తా : కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు, తనకు ఎటువంటి సంబంధం లేదని సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించాలని, అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కూతురు కవిత ఉన్నారని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఆమె ఇతరుల ద్వారా రూ.4.5 కోట్లు ఇప్పించారంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, బట్ట కాల్చి మీద వేసి మీరే తుడుచుకోండి అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన, మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ‘‘ఇది కేంద్రంలో బీజేపీ చేస్తున్న కుట్ర. ఇలాంటి వాటికి మేం భయపడేది లేదు. ఈ వ్యర్థ ప్రయత్నాలు వ్యర్థంగానే మిగిలిపోతాయి. ఇందులో వచ్చేదీ లేదు.. సచ్చేదీ లేదు’’ అని వ్యాఖ్యానించారు. నిత్యం మీడియాలో ఏదో ఒక కథనం ఇచ్చి కేసీఆర్‌ను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నమని దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ కోసం ఉద్యమించినప్పటి నుంచీ కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద అనేక ఆరోపణలు చేశారు. అయినా, మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం మేం. కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్ వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదు. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నాలు తప్ప ఇవి మరొకటి కావు’’ అని వ్యాఖ్యానించారు. దేశం ఎలా అభివృద్ధి చెందాలనే ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని, తామంతా అడుగులో అడుగు వేస్తూ ఆయన చూపిన బాటలో ముందుకు నడుస్తామని అన్నారు. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల గురించి ప్రశ్నించినా, ఉద్యోగాల విషయం అడిగినా జవాబు చెప్పకుండా ప్రతిపక్షాలపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టించడం సరికాదన్నారు. ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరారు.
పరువు నష్టం దావా వేసే యోచనఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు అక్కడి బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యోచిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేయడంతోపాటు తనపై నిరాధార ఆరోపణలు చేశారని, వారు అటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని, ఆ తర్వాత కోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.