తమ్ముడి బాటలో అన్న ?
కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎవ్వరికీ అంతపట్టవు. ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో వారికే తెలియదు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు ఉన్న కోమటి రెడ్డి బ్రదర్స్‌లో ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఆయన స్వంత అన్న వెంకట్‌రెడ్డి మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
అయితే ఇప్పుడు వచ్చిన చిక్కుల్లా… త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయాలని వెంకట్ రెడ్డిని కోరుతున్నారు. కాగా ఆయన ప్రచారాని దూరంగా ఉంటున్నారు. ఇక వెంకట్ రెడ్డి కూడా తమ్ముడి బాటలో నడుస్తారని స్థానికులు చెబుతున్నారు.
ఇక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీ లోని కొందరు తనను అవమానపరుస్తున్నారని, పార్టీ కోసం మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న తనలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరి తనకు మనస్తాపాన్ని కలిగించిదని పేర్కొన్నారు. కాగా సోనియాగాంధీకి కోమటిరెడ్డి రెండు లేఖలు పంపారని, ఒక లేఖ బహిర్గతం కాగా మరో లేఖను గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. బహిర్గతమైన లేఖలో రేవంత్ వైఖరి కారణంగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వెంకట్‌రెడ్డి కూలంకషంగా వివరించారని సమాచారం. పార్టీలో పరిణామాలన్నీ అర్థమయ్యే విధంగా రాసిన ఈ లేఖలో.. తెలంగాణ పార్టీలో జరగాల్సిన అంతర్గత మార్పుల గురించి కూడా ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది.
వాళ్లతోనే ప్రచారం చేయించుకోండి: కోమటిరెడ్డి
ఢిల్లీలో భేటీకి గైర్హాజరై హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వాళ్లను గుర్తించకుండా నాలుగు పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, తెలంగాణ కోసం కొట్లాడిన తనలాంటి వారిని పట్టించుకోకుండా హడావుడి చేసే వాళ్లను గుర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీ విషయంలో మాణిక్యం ఠాగూర్ దొంగనాటకాలాడుతున్నారని, పార్టీ కార్యకర్తలకు అవమానం జరుగుతోందని చెప్పారు.
ఇలాంటి వైఖరి కారణంగానే తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయిందని, దానికి ప్రతిఫలంగానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ప్రచారం చేసిన వాళ్లతోనే మునుగోడులోనూ ప్రచారం చేయించుకోవాలని అన్నారు. మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలన్నారు. ఆయన స్థానంలో కమల్‌నాథ్ లాంటి నేతలను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జులుగా పంపాలనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. మరోసారి పార్టీ నేతలందరి అభిప్రాయాలను తీసుకుని కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని స్పష్టం చేశారు.