ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం
నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి, జాయ్ క్లినిక్, డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. బొల్లారం కేబీఆర్ కాలనీలో మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసు పక్కన జాయ్ క్లినిక్, డయాగ్నోస్టిక్స్ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి జిన్నారం మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొలను బాల్‌రెడ్డి సహకారం అందించారు. ఆయన, బొల్లారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ కొలను రోజారాణి కలిసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో ఉచితంగా కంటిపరీక్ష, డెంటల్ చెకప్, బీపీ, డయాబెటిక్ చెకప్, ఈసీజీ, 2డి ఎకో తదితర పరీక్షలు చేయడంతో పాటు హాజరైనవారికి ఉచితంగా వైద్యసలహాలు, సూచనలు, డైటీషియన్‌తో ఆహార నియమాలను వివరించారు. ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శృతి ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి పైగా స్థానికులకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేశారు.
మధుమేహం, బీపీ ఉన్నవారికి కంటిచూపు సంబంధిత సమస్యలతో పాటు గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని, అందువల్ల ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యులను సంప్రదించి, మందులు సరిగ్గా వాడాలని డాక్టర్ శృతి సూచించారు. జాయ్ క్లినిక్‌కు చెందిన ఫిజిషియన్ డాక్టర్ షైనీ సల్మా కూడా రోగులను పరీక్షించి, తగిన సూచనలు, సలహాలు అందించారు.