కిమ్స్ కర్నూలులో మొట్టమొదటి కెడవార్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్
మూత్రపిండాలు పాడై, దీర్ఘకాలంగా ఆ సమస్యతో బాధపడుతున్న రోగులకు జీవన్‌దాన్ ఓ వరం. అయితే, ఇంతకాలం కర్నూలుతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎవరైనా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేయించుకోవాలంటే హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి పెద్ద నగరాలకే వెళ్లాల్సి వచ్చేది. జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా అక్కడే మూత్రపిండాలు మార్చేవారు. ఏడాది నుంచి ప్రొద్దుటూరులో డయాలసిస్ చేయించుకుంటున్న ఓ మహిళకు తాజాగా కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో జీవన్‌దాన్ కార్యక్రమం కింద మూత్రపిండం అమర్చి ఆమెకు కొత్తజీవితం అందించారు. ఈ వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ అనంతరావు, కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు.
ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సరళాదేవికి మూత్రపిండాలు పాడయ్యాయి. దాంతో ఆమె ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. జీవన్‌దాన్ కార్యక్రమం కింద కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో మూత్రపిండాల మార్పిడి జరుగుతుందని తెలిసి ఇక్కడ రిజిస్టర్ చేయించుకున్నారు. 2022 జులై 3న ఆమెకు శస్త్రచికిత్సకు రావాలని పిలుపు వచ్చింది. తెలంగాణలోని గద్వాలకు చెందిన 30 ఏళ్ల చరిత బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించారు. అందులో భాగంగా ఒక మూత్రపిండాన్ని కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి, మరో మూత్రపిండాన్ని నెల్లూరులో ఒక రోగికి, కాలేయాన్ని గుంటూరులో మరో రోగికి ఇచ్చారు. సరళాదేవికి విజయవంతంగా కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో మూత్రపిండాన్ని మార్చడంతో ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారు. కిమ్స్ ఆస్పత్రికి చెందిన చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు ఈ శస్త్రచికిత్స చేశారు. కర్నూలు ప్రాంతంలో కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్ (మృతుల అవయవాలను వేరేవారికి అమర్చడం) ఇదే మొదటిసారి. బతికున్నవారి నుంచి మూత్రపిండాన్ని తీసి అమర్చడం కంటే మృతుల మూత్రపిండం అమర్చడం చాలా సవాలుతో కూడుకున్నది. బ్రెయిన్‌డెడ్ అని ప్రకటించడం, బంధువులకు కౌన్సెలింగ్, అవయవాలను జాగ్రత్తగా తీయడం, జీవన్‌దాన్ బృందంతో సమన్వయం చేసుకుని అవయవాలను కేటాయించడం, అది సరిపోతుందో లేదో పరీక్షలు చేయడం.. ఇవన్నీ కేవలం 24 గంటల వ్యవధిలోనే పూర్తికావాలి. అనుకున్నట్టుగానే అన్ని కార్యక్రమాలూ విజయవంతంగా పూర్తయ్యి, ఆస్పత్రిలో తొలిసారి కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్ పూర్తింది. ఇందుకోసం చాలా విభాగాలు సమన్వయంతో పనిచేశాయి. వాటిలో నెఫ్రాలజీ, యూరాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, క్రిటికల్ కేర్, ఎనస్థీషియా, ఆస్పత్రి యాజమాన్యం, గ్రీన్‌ఛానల్ ఏర్పాటుకు పోలీసుశాఖ, అవయవ కేటాయింపునకు జీవన్‌దాన్.. ఇలా అందరూ సమన్వయంతో కృషిచేశారు. గతంలో కేవలం మెట్రో నగరాల్లోనే జరిగే ఈ మార్పిడి.. తొలిసారిగా కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోనూ అందుబాటులోకి వచ్చింది. తొలికేసు కూడా పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యింది. దాంతో రాయలసీమ ప్రాంతంలో ఉన్న చాలామంది డయాలసిస్ రోగులు మూత్రపిండాల మార్పిడికి ఇక కిమ్స్ ఆస్పత్రికి రావచ్చు. ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం. ఎవరైనా మరణించినప్పుడు వారి శరీరాన్ని దహనం లేదా ఖననం చేయడం కంటే అవయవ దానానికి ముందుకొస్తే 8 ప్రాణాలను కాపాడినట్లవుతుంది. అందుకోసం Jeevandan.ap.gov.inలో అవయవదాతగా నమోదు చేసుకోవచ్చు, లేదా కర్నూలు కిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగాన్ని సంప్రదించవచ్చు అని డాక్టర్ అనంతరావు, డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.
ఎవరికి అవసరం
దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి ఐదో దశలో ఉన్న రోగులకు సాధారణంగా మూడు రకాల చికిత్సలు చేస్తారు. అవి హెమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ మరియు మూత్రపిండాల మార్పిడి. ఈ మూడింటిలో మూత్రపిండాల మార్పిడి అత్యుత్తమం. దీనివల్ల డయాలసిస్ కంటే జీవితకాలం, జీవన నాణ్యత రెండూ పెరుగుతాయి. మూత్రపిండాల దాతలు రెండు రకాలు. ఒకటి జీవించి ఉన్నవారు, రెండు మరణించినవారు. రోగుల సమీప బంధువులు అంటే తల్లిదండ్రులు, భార్య/భర్త, తోబుట్టువులు, తాత, మామ్మలు ఇవ్వగలరు. ఇలా ఇవ్వాలనుకున్నవారి ఆరోగ్యం సహకరించకపోయినా, బ్లడ్‌గ్రూపు లేదా హెచ్ఎల్ఏ సరిపోకపోయినా తీసుకోరు. అలాంటివారు ఆంధ్రప్రదేశ్‌లో జీవన్‌దాన్ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా బ్రెయిన్‌డెడ్ అయితే వాళ్ల బంధువుల అంగీకారం ఉన్నప్పుడు అవయవాలు దానం చేస్తారు. వాటిని సీరియల్ క్రమం ప్రకారం జీవన్‌దాన్‌లో పేర్లు నమోదు చేసుకున్నవారికి అమరుస్తారు.