వైద్యో.. బహుముఖ ప్రజ్ఞాశాలిః

వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. వైద్యవృత్తిలో ఉండటం అంటే రోగులకు ప్రాణదానం చేయడమే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా తమ వృత్తిలో వీరు తలమునకలై ఉంటారు. కానీ, అదే సమయంలో చాలామంది వైద్యుల్లో రెండోకోణం కూడా ఉంటోంది. కొందరు సంగీతంలో ప్రవీణులైతే మరికొందరు అద్భుతమైన చిత్రాలు తమ కుంచె నుంచి జాలువారుస్తారు. కొందరు ప్రకృతి ప్రేమికులైతే ఇంకొందరు శారీరక దారుఢ్యంలో అందరికీ శిక్షణ ఇచ్చి, భావిభారతాన్ని బలంగా చేయాలని చూస్తుంటారు. ఈ నెల 1 జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా వైద్యవృత్తితో పాటు.. ప్రవృత్తి రీత్యా వేర్వేరు హాబీలను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్న పలువురు వైద్యుల గురించి తెలుసుకుందాం.

సినీ నిర్మాత, పాట రచయిత, సంగీత దర్శకుడు.. డాక్టర్ సతీష్, కిమ్స్ ఐకాన్ ఎండి, కన్సల్టెంట్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్

వృత్తిరీత్యా డాక్టర్ పెతకంశెట్టి స‌తీష్‌కుమార్‌, విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. ఆస్పత్రికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. రోజంతా పని చేసుకున్న తర్వాత రాత్రి 11 గంటల నుంచి దాదాపు మూడు గంటల పాటు ఆయన పాటలు రాయడానికి, వాటికి బాణీలు కట్టడానికి కష్టపడతారు. అంతేకాదు, సినిమా నిర్మాణంలోనూ ఈయన అడుగుపెట్టారు. దహనం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమాకు ఆయనకు నాలుగు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు లభించాయి కూడా. బాంబే ఫిలిం ఫెస్టివల్లో రెండు, రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్లో రెండు అందుకున్నారు. చిన్నతనం నుంచి సరదాగా పాటలు పాడుతూ, వాటిలో సొంతంగా పదాలు కూడా సమకూర్చడం అలవాటుగా ఉండేది. అప్పుడే గిటార్ నేర్చుకున్నారు. క్రమంగా కీబోర్డు.. ఇలా అన్నీ నేర్చుకుని తన వృత్తితో పాటు ప్రవృత్తినీ వదలకుండా ఈ స్థాయికి చేరుకున్నారు. ఏరోజూ తన వృత్తిపై నిర్లక్ష్యం చేయకుండా చదువులో డిస్టింక్షన్ సాధించారు. ఇటీవలే రెండు షార్ట్ ఫిలింలు కూడా తీశారు.

ఈయన కుంచే వర్ణించలేని చిత్రం

డాక్టర్ ప్రశాంత్, వైజాగ్లోని కిమ్స్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తారు. ఈయన రోగులను ఎంత శ్రద్దగా, మంచి ఆకారంలోకి తీసుకువస్తారో…. అంతే శ్రద్దగా బొమ్మలు కూడా వేస్తాడు. వైద్యంతో పాటు.. పెయింటింగ్ వేయడం ఈమె హాబీ. ప్రకృతిదృశ్యాలు ఈమె కుంచె నుంచి జాలువారుతాయి. రోజువారీ వృత్తిలో ఉండే ఒత్తిడి నుంచి ఊరట కలిగించడానికి, మనసును ఆహ్లాదంగా ఉంచడానికి పెయింటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ ప్రశాంత్ చెబుతారు. చిన్నప్పటి నుండి పెయింటింగ్ వేయడం అలవర్చుకున్నాను. ఎవరి సాయం లేకుండా సొంతగా… ఆర్ట్స్ వేయడం అలవాటైపోయింది. ఈ చిత్రాలను గీయడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించి మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నాను. గ్రాఫైట్, చార్కోల్ పెన్సిల్ ఆర్ట్, ఆక్రిలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, టీ షర్ట్స్ చిత్రాలు వేయడం ఇష్టం.