అమోర్‌లో హైప‌ర్ హైడ్రోసిస్ శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం

నగరంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన అమోర్ హాస్పిటల్స్ వైద్యులు ‘హైపర్ హైడ్రోసిస్’ అనే ఒక అరుదైన వ్యాధికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వేడి గానీ, వ్యాయామం చేయడం గానీ లేకుండానే చేతుల్లో విపరీతంగా చెమట పట్టడం దీని లక్షణం. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకి చాలా చెమట పడుతుంది. అది వేసుకున్న బట్టలను తడిపేసి, చేతుల నుంచి కూడా బొట్లు బొట్లుగా కారుతుంది. సాధారణ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడంతో పాటు, ఇలా ఎక్కువగా చెమట పట్టడం సామాజిక ఆందోళన, ఇబ్బంది కలిగిస్తుంది. ఇదే ఈ రోగి విషయంలో జరిగింది.

హైదరాబాద్‌కి చెందిన 28 ఏళ్ల మహేశ్ బాబు చాలా సంవత్సరాలుగా హైపర్ హైడ్రోసిస్‌తో బాధ పడుతున్నారు. దీని వల్ల అతను తన చదువుకు తగిన ఉద్యోగాన్ని చేపట్టలేకపోయి, వాల్ పెయింటర్‌గా స్థిరపడాల్సి వచ్చింది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే, అతను ఎవరైనా స్నేహితులను కలవడానికి సంకోచించేవాడు, పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడేవాడు. ఇది వెయ్యిమందిలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే రోగం; ప్రముఖ హాలీవుడ్ నటీమణులు కామెరాన్ డియాజ్, ‘బాండ్ గర్ల్’ హాలే బెర్రీ ఒకప్పుడు ఈ వ్యాధి బారిన పడ్డారు.

ఈ సమస్య గురించి, దానికి చేసిన శస్త్రచికిత్స గురించి వ్యాఖ్యానిస్తూ, కూక‌ట్‌ప‌ల్లిలోని అమోర్ ఆసుపత్రికి చెందిన జ‌న‌ర‌ల్ మ‌రియు లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్ డాక్టర్ సృజ‌న్ కుమార్‌ మాట్లాడుతూ, “రోగులకే కాదు, వైద్య రంగానికి చెందిన చాలా మందికి కూడా ఈ సమస్యకు శస్త్రచికిత్స ద్వారా పరిష్కారం ఉందని తెలియదు. ఈ సమస్య వల్ల అరిచేతుల్లో, కాళ్లలో విపరీతంగా చెమటలు పడతాయి. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఒక చెక్కుమీద సంతకం పెట్టాలన్నా, ఆలోపే అది తడిసిపోతుంది. పరీక్షలు రాయడం కూడా కష్టమయ్యేది. ఈ సమస్య వల్ల మహేశ్ పదిమంది వద్దకు వెళ్లడానికి, చివరకు ఉద్యోగాలు చేయడానికి కూడా ఇబ్బంది అయ్యి, నాలుగైదు ఉద్యోగాలు మారాల్సి వచ్చింది. చివరకు ఏమీ చేయలేక గోడలకు పెయింట్లు వేసుకునే పనిలో కుదురుకున్నాడు. ఈ సందర్భంలో, తన ఇబ్బందిని పరిష్కరించే శస్త్రచికిత్స చేయించుకోవడానికి మహేశ్‌ని ఒప్పించాము. మేము “థెరకోస్కోపిక్ సింపాథెక్టమీ” అనే మినిమల్లీ ఇన్వేజివ్ శస్త్రచికిత్స చేశాము. దీనిలో కొన్ని ప్రదేశాల్లో సింపథెటిక్ నరాలను కత్తిరించడానికి ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తారు. ఈ శస్త్రచికిత్సలో సమస్య మూలకారణాన్ని తొలగించడానికి దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఈ శస్త్రచికిత్స తర్వాత, రోగి కోలుకోవడానికి ఆసుపత్రిలో ఉంచాము,” అని అన్నారు.

మహేశ్ బాబు తన మానసిక ఆరోగ్యం, సామాజిక జీవితంపై ప్రభావం చూపించే పరిస్థితి నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. అతను ఇప్పుడు తన చదువుకు సరిపోయే ఉద్యోగం చేసుకుంటున్నాడు; పెళ్లి కూడా చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో చాలామంది రోగులు లేదా వారి సమీప బంధువులు, సన్నిహితులు ఏళ్ల తరబడి బాధపడుతున్న సమస్యకు వైద్య పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని అమోర్ హాస్పిటల్స్ వైద్యులు నమ్ముతారు. ప్రజలు ఆశను కోల్పోకుండా ఉండటం, సమస్యలను అధిగమించడానికి సరైన వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం.