ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో 5 కె రన్
నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజారోగ్యంపై పొగాకు దుష్ప్రభావాల గురించి అవగాహన పెంచేందుకు ఈ ఆదివారం, మే 29న ‘5కె రన్నింగ్ & సైక్లింగ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మే 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు, మరియు శాసన మండలి సభ్యులు శంభీపూర్ రాజు, నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, శనగల ధనరాజ్ యాదవ్, డిప్యూటీ మేయర్ నిజాంపేట్, నిజాంపేట్ మునిసిపాలిటీ 16వ డివిజన్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, నిజాంపేట్ మునిసిపాలిటీ 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు కార్యక్రమంలో పాల్గొననున్నారు అని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డివిఎస్ సోమరాజు గారు గురువారం పత్రిక ప్రకటనలో తెలియజేసారు.
హేపీ హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్‌లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ప్రాంగణంలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై, నిజాంపేట చుట్టూ తిరిగి, అనంతరం మళ్లీ ఆస్పత్రి ప్రాంగణంలో ముగుస్తుంది. కార్యక్రమంలో ప్రవేశం పూర్తిగా ఉచితం. పాల్గొనాలనుకునేవాళ్లు 9133339498 / 9912071207 నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకునేవారందరికీ ఉచితంగా టీషర్టు అందిస్తారు, ఆస్పత్రి ప్రాంగణంలో అందరికీ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు మాట్లాడుతూ, “పొగాకు కాల్చడం ఈ రోజుల్లో చాలామందికి ఫ్యాషన్. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉంటున్నారు! వాళ్లకు తెలిసేలోపే ధూమపానం చేసేవారితో పాటు వాళ్లతో కలిసి ఉండేవారి ఆరోగ్యాలపై కూడా తీవ్ర దుష్ప్రభావాలు పడతాయి. చికిత్స కంటే నివారణ మంచిదని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి భావిస్తుంది. వివిధ వ్యాధుల గురించి, వాటి కారణాలు, నివారణ పద్ధతుల గురించి అవగాహన కల్పించడంలో ముందంజలో ఉంది. ఈ సైక్లింగ్ బృందాలతో భాగస్వాములు కావడం మాకు సంతోషంగా ఉంది. ఔత్సాహికులందరూ ముందుకొచ్చి ఈ సమస్యపై అవగాహన కల్పించాలని వారిని స్వాగతిస్తున్నాము” అని చెప్పారు.
400 మందికి పైగా సైక్లిస్టులు, రన్నర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. ఇది ఆస్పత్రి ప్రాంగణంలో ఉదయం ఫిట్‌నెస్ పత్యంతో మొదలవుతుంది.