మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న మహిళకు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీతో ప్రాణదానం

  • భారీ పరిమాణంలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గుర్తింపు
  • తీవ్రస్థాయిలో రక్తస్రావం, నొప్పి, రక్తహీనత, పొట్ట పెరగడం
  • క్లిష్ట పరిస్థితిలో కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన మహిళ
  • మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ కారణంగా ముప్పు నివారణ

గర్భసంచి తొలగించడానికి లాప్రోస్కొపిక్ సర్జరీ లాంటివి ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ, గతంలో పలు రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికి ఇలాంటివి చేయడం సర్జన్లకు కత్తిమీద సాము లాంటిదే. ముఖ్యంగా ఫైబ్రాయిడ్లు పెద్దపరిమాణంలో ఉన్నప్పుడు వాటిని చిన్న కోతలతో తొలగించడం కష్టం అవుతుంది. అయితే కిమ్స్ ఆస్పత్రి లాంటి కార్పొరేట్ ఆస్పత్రులలో అందుబాటులో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన, నైపుణ్యం ఉన్న సర్జన్ల కారణంగా ఇలాంటి సంక్లిష్టమైన సర్జరీలను కూడా సులభంగా చేయగలుగుతున్నారు. మెనోపాజ్కు ముందు దశలో ఉన్న మహిళల్లో దాదాపు సగం మందికి పైగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి. 14 ఏళ్ల క్రితం మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న 38 ఏళ్ల మహిళకు ఇలాంటి సమస్య రావడం, ఫైబ్రాయిడ్లు భారీగా ఉన్నా.. కిమ్స్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో ఆమెకు శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు కాపాడారు. ఈ వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు డాక్టర్ పద్మావతి వేమా తెలిపారు.

ఉప్పల్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల రజితకు అప్పటికే మూత్రపిండాన్ని మార్చారు. దాంతో ఆమకు హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) ఆపరేషన్కు ముందు చేయాల్సిన పరీక్షలు చేశాం. గతంలో ఆమెకు రుతు సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం, ఫలితంగా రక్తహీనత లాంటివి ఫైబ్రాయిడ్ల వల్లే ఉన్నా, ఆయా లక్షణాలకు వేర్వేరు చికిత్సలు చేశారు. సాధారణంగా గర్భసంచి 5.5 x 6 cm పరిమాణంలో ఉంటుంది. కానీ, ఆమెకు చేసిన వైద్యపరీక్షల్లో అది 10.3 x 14.0 x 14.3 cm స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఆమెకు రుతుస్రావం సమయానికి కాకపోవడం, అధిక రక్తస్రావంతో తీవ్రమైన నొప్పి లాంటివి ఉన్నా, కేవలం మందులు, ఇంజెక్షన్లతో ఇంతకుముందు చికిత్స చేశారు. దాంతో ఆమెకు ఇప్పుడు టోటల్ లాప్రోస్కొపిక్ హిస్టరెక్టమీ (టీఎల్హెచ్) చేయాలని నిర్ణయించాం.

సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు డాక్టర్ పద్మావతి వేమా ఆధ్వర్యంలో టీఎల్హెచ్ చికిత్స చేశారు. కేవలం 3 చోట్ల 5 మిల్లీమీటర్ల మేర మాత్రమే కోతలు పెట్టారు. వాటిద్వారా మొత్తం ఫైబ్రాయిడ్లను తొలగించారు. ఉదరభాగానికి అతుక్కుని ఉన్న గర్భాశయాన్ని కూడా తొలగించారు. శస్త్రచికిత్స మొత్తం పూర్తయిన తర్వాత మార్చిన మూత్రపిండం బాగా పనిచేస్తోందా, అలాగే బ్లాడర్ సరిగా ఉందా లేదా అన్న విషయాలను యూరాలజిస్టు డాక్టర్ అరబింద్ పాండా నిర్ధారించారు. మొత్తం శస్త్రచికిత్సకు రెండున్నర గంటల సమయం పట్టింది. చిన్నపాటి కోతలే పెట్టడంతో రోగికి నొప్పి తక్కువగా ఉండి, త్వరగా కోలుకున్నారు, మరే విధమైన సమస్యలూ రాలేదు. శస్త్రచికిత్స జరిగిన మూడోరోజున క్రియాటినైన్ స్థాయి 0.8 మాత్రమే ఉండటంతో ఆమెను డిశ్చార్జి చేశారు.

మూత్రపిండాల మార్పిడి వల్ల దీర్ఘకాలంగా స్టెరాయిడ్లు వాడుతుండటంతో సాధారణ పద్ధతిలో హిస్టరెక్టమీ చేస్తే గాయాలు మానడం ఆలస్యం అవుతుంది, గాయాల వద్ద ఇన్ఫెక్షన్లు కూడా అయ్యే ప్రమాదముంది. అదే లాప్రోస్కొపిక్ పద్ధతిలో చేయడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గాయని నెఫ్రాలజిస్టు డాక్టర్ అశ్వినీదత్ తెలిపారు.

గర్భాశయం 1500-2000 గ్రాములకు పైగా ఉన్నప్పుడు టోటల్ మినిమల్ యాక్సెస్ హిస్టరెక్టమీ చేయడమే అన్నిరకాలుగా సురక్షితమని డాక్టర్ పద్మావతి వేమా చెప్పారు. “అది మాత్రమే కాక, ఇంకా పలు రకాల కారకాలను దృష్టిలో పెట్టుకుని శస్త్రచికిత్స ఎలా చేయాలో నిర్ణయించుకోవాలి. నిపుణులు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉంటే సాధారణ హిస్టరెక్టమీ బదులు చిన్న కోతతో చేయొచ్చు. ఇలాంటివి సాధారణ ఆస్పత్రుల్లో సాధ్యం కావు. కిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్లే ఇది చేయగలిగాం. తద్వారా రోగి ప్రాణాలు కాపాడగలిగాం” అని డాక్టర్ పద్మావతి వేమా తెలిపారు.