అరుదైన ఘ‌న‌త సాధించిన డాక్ట‌ర్ వ‌సుంధ‌ర చీపురుప‌ల్లి

  • హీమోఫీలియా రోగికి గర్భాశయ కేన్సర్
  • రోబోటిక్ సర్జరీతో నయం చేసిన కిమ్స్ డాక్ట‌ర్‌
  • 10-15 మి.లీ. రక్తస్రావం మాత్రమే అయ్యేలా జాగ్రత్తలు
  • అరుదైన ప్రక్రియతో బాధితురాలికి ప్రాణదానం

హీమోఫీలియా.. రక్తం గడ్డకట్టని అరుదైన వ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో చిన్నపాటి దెబ్బ తగిలినా, అసలు గట్టిగా ముట్టుకున్నా కూడా రక్తస్రావం అస్సలు ఆగదు. అలాంటిది వీరికి ఏమైనా శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే..! సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే అనుభవజ్ఞులైన పలు విభాగాల వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉపయోగపడతాయి. గైనకాలజిస్టులు, హెమటో ఆంకాలజిస్టులు, మెడికల్, సర్జికల్ ఆంకాలజిస్టులు ఉండటంతో పాటు.. రోబోటిక్ సర్జరీ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు హీమోఫీలియా ఉన్న రోగికి విజయవంతంగా గర్భాశయ కేన్సర్కు శస్త్రచికిత్స చేసి, ఆమెకు ప్రాణదానం చేశారు. ఈ వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గైనకాలజిస్టు, ఆబ్స్టెట్రీషియన్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి తెలిపారు.

“హైదరాబాద్ నగరానికి చెందిన 58 ఏళ్ల సావిత్రి మాజీ సైనికాధికారి భార్య. ఈమెకు హీమోఫీలియా ఉంది. దానివల్ల గతంలో ప్రసవం అయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు మూడు రోజుల పాటు రక్తం ఎక్కిస్తూనే ఉండాల్సి వచ్చింది. అప్పట్లో దాదాపు మృత్యుముఖం వరకు వెళ్లి వచ్చారని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఆమెకు గర్భాశయ కేన్సర్ సోకింది. దానికి తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలి. కానీ హీమోఫీలియా ఉండటంతో అందుకు ఎవరూ ముందుకు రాలేదు. మేం కూడా తొలుత కొంత అనుమానించాం. కానీ తర్వాత చేర్చుకున్నాం. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేసి, హీమోఫీలియాలోని ఫ్యాక్టర్ 8 నియంత్రణకు వాడే ఖరీదైన ఇంజెక్షన్ల వాడకం కోసం ఈసీహెచ్ఎస్ (మాజీ సైనికోద్యోగుల వైద్య బీమా) సంస్థ నుంచి అనుమతి తీసుకున్నాం. వీటి ఖరీదే దాదాపు రూ.25 లక్షలకు పైగా ఉంటుంది. ఫ్యాక్టర్ 8 అనేది రక్తాన్ని గడ్డకట్టించేందుకు శరీరంలో ఉండే దాదాపు 12 రకాల ఫ్యాక్టర్లలో ఒకటి. ఇది తగినంతగా లేకపోతే రక్తం గడ్డకట్టదు, ఫలితంగా రక్తస్రావం అవుతుంటుంది. అనుమతి వచ్చిన తర్వాత ప్రతిరోజూ ఫ్యాక్టర్ 8 చెక్ చేసుకుని, ఆమెకు రక్తస్రావం తక్కువయ్యే అవకాశం ఉందని తెలుసుకుని ఆ రోజు రోబోటిక్ సర్జరీ చేశాం. అదే ఓపెన్ సర్జరీ చేసి ఉంటే అసాధారణంగా రక్తస్రావం అయి ఉండేది. ఇందులో భాగంగా మూడుచోట్ల చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే పెట్టాం. రోబోటిక్ సర్జరీ కావడంతో, ఆమెకు సుమారు 10-15 మి.లీ. రక్తం కూడా పోలేదు. శస్త్రచికిత్స చేసి, మళ్లీ ఆమెకు అవసరమైన మందులన్నీ ఇచ్చి, మళ్లీ ప్రతిరోజూ ఫ్యాక్టర్8 చెక్ చేసుకుని, వారం రోజుల పాటు ఇంజెక్షన్లు ఇచ్చాం. దాదాపు 250 ఇంజెక్షన్లు ఇలా ఇవ్వాల్సి వచ్చింది. ఈ శస్త్రచికిత్సలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ నరేంద్రకుమార్ తోట, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మధు దేవరశెట్టి కూడా ఎంతో సహకరించారు. ఐసీయూలో సిబ్బంది సైతం వారం రోజుల పాటు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుని పూర్తిగా నయం చేశారు. అన్నీ బాగున్నాయనకున్న తర్వాత ఆమెను డిశ్చార్జి చేసి ఇంటికి పంపాం” అని డాక్టర్ వసుంధర చీపురుపల్లి తెలిపారు.

అత్యంత అరుదైన సమస్య ఉన్నా, ఏమాత్రం రక్తం పోకుండా ఇంత పెద్ద శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు కాపాడినందుకు సావిత్రి కుటుంబసభ్యులు వైద్యసిబ్బందికి, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.