అమ్మ ప్రేమ ముందు మరణం చిన్నబోయింది
- పుట్టుకతోనే బిలియరీ అట్రేజియా సమస్య
- మానవతా దృక్పథంతో ఉచితంగా పూర్తి చికిత్స
- నేడు అంతర్జాతీయ కాలేయ దినం
డెక్కన్ న్యూస్: అమ్మ ప్రేమ వెలకట్టలేనిది అంటారు. ఇది ముమ్మాటికి నిజమైనప్పటికీ మరో మారు రుజువైంది. బిడ్డ ప్రాణాలను కాపాడడానికి తన అవయావాన్ని కోసి పంచింది. బంధాలు బంధుత్వాలు వేరువుతున్న ఈ సమాజంలో మారోమారు ఈ అమ్మ ప్రేమ ముందు మరణం చిన్నబోయింది.
అప్పుడే పుట్టిన బిడ్డ… రెండు నెలలు దాటకముందే జాండీస్ (పసకలు) అయ్యాయి. దీంతో చాలా హాస్పిటల్స్ ముందు తిరిగితే మీ బిడ్డ రేపో… మాపో… లేదా ఇవాళ సాయంకాలనికో మరణిస్తుందనే చెప్పారు కానీ… బతుకిస్తామని ఏ వైద్యుడు చెప్పలేకపోయాడు. కానీ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కిమ్స్ హాస్పిటల్‌లోకి వచ్చిన ఆ అమ్మకి భరోసా ఇచ్చి మీ బిడ్డను బతికిస్తాం అని ధైరాన్ని ఇచ్చారు. అమ్మగా నీ అవయవాన్ని ఇవ్వాల్సి ఉంటదని వివరించారు.
అంతర్జాతీయ లివక్ (కాలేయ) దినోత్సవంగా డెక్కన్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం. వివరాల్లోకి వెళ్తే…
బిలియరీ అట్రేజియా అనేది పిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే కాలేయ వ్యాధి. ఈ వ్యాధి వస్తే, వాళ్లకు పిత్తనాళం అసలు రూపొందదు. ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. భారతదేశంలో ప్రతి 20వేల మంది పిల్లల్లో ఒకరికి బిలియరీ అట్రేజియా సమస్య వస్తుంది. త్వరగా గుర్తిస్తే వారికి పోర్టోఎంటెరోస్టమీ లేదా కసాయ్ ప్రొసీజర్ (తొలిసారి చేసిన సర్జన్ పేరుమీద వచ్చింది) చేస్తారు. అదే మూడు నెలల కంటే ఆలస్యమైతే, కాలేయంలో సెకండరీ బిలియరీ సిరోసిస్ వస్తుంది, అప్పుడు కసాయ్ ప్రొసీజర్ సరిపోదు. కొన్ని సందర్భాల్లో ముందుగానే ఈ శస్త్రచికిత్స చేసినా, అది విఫలమైతే సమస్య మళ్లీ వచ్చి, అప్పుడు కూడా కాలేయమార్పిడి చేయాల్సి ఉంటుంది. పిల్లలకు జరిగే కాలేయ మార్పిడులలో దాదాపు 50%కు బిలియరీ అట్రేజియానే కారణం. కాలేయ ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించేందుకు ఏప్రిల్ 19ని అంతర్జాతీయ కాలేయదినంగా పాటిస్తారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఇటీవల 6.8 కిలోల బరువు, 9 నెలల వయసు ఉన్న చిన్నారికి చేసిన కాలేయమార్పిడి శస్త్రచికిత్స గురించి కాలేయమార్పిడి విభాగాధిపతి డాక్టర్ రవిచంద్ సిద్దాచారి వివరించారు.
“మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన నిరుపేద తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చారు. అప్పటికి వాళ్ల పాప వయసు 7 నెలలు. పాపకు పుట్టిన నెల రోజులకే కామెర్లు రావడంతో తొలుత స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించారు. వాళ్లు వెంటనే పాపను హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి పంపగా, అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. కానీ, అప్పటికీ ఆమెకు కామెర్లు తగ్గకపోగా, కాలేయం విఫలమవుతున్న లక్షణాలు కనిపించాయి. మలంలో రక్తం పోతోంది.
దాంతో సమస్య తీవ్రత దృష్ట్యా పాపను కిమ్స్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ పరీక్షలు చేయగా, బిలియరీ అట్రేజియా అని గుర్తించాము. వెంటనే కాలేయమార్పిడి చేయాలని నిర్ణయించాము. ఈ పాపకు ఆమె తల్లి కాలేయదానం చేసేందుకు ముందుకొచ్చారు. దాంతో తల్లి కాలేయంలోని చిన్న ముక్కను తీసి పాపకు అమర్చాం. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలకు రూ.15-20 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, పాప తల్లిదండ్రుల పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం మొత్తం కాలేయమార్పిడి ప్రక్రియ మొత్తాన్ని దాదాపు ఉచితంగా చేసింది. ఇప్పుడు పాప పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది.
గతంలో ఫిలిప్పీన్స్ పాపకూ…
2020 నవంబరులో ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఓ పాపకు కూడా ఇదే సమస్య తలెత్తింది. అక్కడినుంచి తల్లిదండ్రులు ఆమెను కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పట్లో పాప తండ్రి తన కాలేయాన్ని దానం చేయడంతో దానిలో చిన్న ముక్కను తీసి పాపకు అమర్చాం. పాప పూర్తిగా కోలుకోవడంతో వాళ్లు తమ స్వదేశానికి వెళ్లారు.
మైక్రోస్కోప్‌లో చూడాల్సిందే…
పిల్లల అవయవాలు అన్నీ చాలా చిన్నగా ఉంటాయి. అందులో చాలా భాగాలు సాధారణ కంటికి కనిపించవు. అందువల్ల కాలేయమార్పిడి చేసేటప్పుడు తప్పనిసరిగా మైక్రోస్కోప్‌తో చూసి చేయాలి. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తల్లి లేదా తండ్రి నుంచి కాలేయంలో 20-25% తీసుకుంటాం. అయినా, పిల్లల ఉదర భాగం చాలా చిన్నదిగా ఉండటంతో ఇది కూడా ఎక్కువ అవుతుంది. కాలేయం 500 రకాల కీలకమైన పనులు చేస్తుంది. దీన్ని మన శరీరంలో ఫ్యాక్టరీ అంటారు. ఇది జీర్ణక్రియలో చాలా కీలకం. కొన్నిరకాల ప్రోటీన్లు, రక్తాన్ని గడ్డకట్టించే పదార్థాలు ఉత్పత్తి చేయడంతో పాటు విటమిన్లు, ఖనిజలవణాలను శరీరంలో నిల్వచేస్తుంది. రక్తం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది. అందువల్ల కాలేయవ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే నిపుణులను (హెపటాలజిస్టులు, కాలేయ సర్జన్లు) సంప్రదించి తగిన చికిత్స పొందాలి. కొందరు పిల్లల్లో కాలేయకేన్సర్ వస్తుంది. దాన్ని హెపటోబ్లాస్టోమా అంటారు. ఇలాంటి సందర్భాల్లోనూ కాలేయమార్పిడి అవసరం అవుతుంది. కిమ్స్ ఆస్పత్రిలో నెలకు సుమారు 6 నుంచి 10 వరకు కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నాం” అని డాక్టర్ రవిచంద్ సిద్దాచారి వివరించారు. ఈ శస్త్రచికిత్సలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రభు, డాక్టర్ కె.ఎన్.పరమేష్, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.