అన్ని అవయవాలూ దెబ్బతిన్న రోగికి ప్రాణదానం
- పెద్దపేగుల సమస్య.. పనిచేయని మూత్రపిండాలు
- మధ్యలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్
- గుండెపోటుతోనూ ఇబ్బంది పడిన రోగి
- అన్ని సమస్యలకూ కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోనే చికిత్స
- పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊరట
దాదాపుగా మృత్యుముఖంలోకి వెళ్లి, పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న రోగికి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు 12 రోజుల పాటు కష్టపడి, అన్ని సమస్యలనూ పూర్తిగా నయం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపారు. పెద్దపేగుల్లో అదనపు పెరుగుదల (హెపాటిక్ ఫ్లెక్సర్) వచ్చి అది అడ్డుపడటంతో మలవిసర్జన కాకుండా పేగుల్లోనే ఉండిపోవడం, బీపీ బాగా పడిపోవడంతో మూత్రపిండాలు దెబ్బతిని మూత్రవిసర్జన పూర్తిగా ఆగిపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, గుండెపోటు.. ఇలా ఇన్నిరకాల అనారోగ్యాలతో బాధపడిన కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని కుగ్రామానికి చెందిన వెంకటనారాయణ (58) అనే రోగిని హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని విభాగాల వైద్యులు ఒక్కచోటే ఉన్న కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. ఈ చికిత్స వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సూరా జానకిరామ్ తెలిపారు.
“వెంకటనారాయణ అనే వ్యక్తి ఒక రోజు రాత్రి సమయంలో ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు. చూస్తే అతడికి మూత్రవిసర్జన కావట్లేదు. స్కానింగ్ చేసి చూస్తే పెద్దపేగుల్లో సమస్య (ఎక్యూట్ ఇంటెస్టైనల్ అబ్‌స్ట్రక్షన్) ఉంది. కానీ ఆపరేషన్ చేయాలంటే మూత్రపిండాల పరిస్థితి బాగోలేదు. సెప్టిక్ షాక్‌లో కూడా ఉన్నారు. దాంతో ముందుగా అతడికి హీమోడయాలసిస్ చేశాం. ఉదయం 6 గంటల వరకు డయాలసిస్ జరిగింది. అప్పటికి పరిస్థితి కొంత మెరుగుపడటంతో 7 గంటలకు థియేటర్‌కు తీసుకెళ్లి, ఆపరేషన్ చేశాం. అతడి పెద్ద, చిన్న పేగులు బాగా లావుగా అయిపోయి, ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంతో కుడివైపు పెద్దపేగులో కొంతభాగాన్ని తొలగించాం. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితిలో పెద్ద, చిన్న పేగులను కలపాలి. కానీ, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో అలా కలపకుండా.. ఐలియాస్టమీ అనే ప్రొసీజర్ చేసి, చిన్నపేగును బయటకు తీసుకొచ్చాం. దానిద్వారా బయట ఒక బ్యాగ్ పెట్టి అందులోకి మలవిసర్జన జరిగేలా చేశాం. మూత్రపిండాల పనితీరు ఇంకా మెరుగుపడకపోవడంతో నెఫ్రాలజిస్టు డాక్టర్ అనంతరావు నేతృత్వంలో మళ్లీ డయాలసిస్ చేశాము. అలా ఐదు రోజుల పాటు చేసిన తర్వాత ఐదోరోజు మూత్రవిసర్జన మామూలుగా అయ్యింది. బీపీ కూడా కొంత పెరగడంతో.. దానికి వాడే మందులు తగ్గించాం. ఈలోపు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి చికిత్స చేశాం. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికీ చికిత్స చేశాం. ఈలోపు అతడికి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ (వెంటిలేటర్ కాకుండా ఆక్సిజన్) పెట్టి చికిత్స చేయాల్సి వచ్చింది. మధ్యలో ఆపరేషన్ అయిన తర్వాత 5-6 రోజుల్లో గుండెపోటు రావడంతో వెంటనే కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోని కార్డియాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర తక్షణ చికిత్స అందించారు. ఇలా మొత్తం 12 రోజుల పాటు ఐసీయూలో ఉన్న తర్వాత మలవిసర్జన సాధారణంగానే అవ్వడంతో వార్డుకు తరలించాం” అని డాక్టర్ జానకిరామ్ వివరించారు. ఈ చికిత్స ప్రక్రియలో నెఫ్రాలజిస్టు డాక్టర్ అనంతరావు, కార్డియాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర, ఇంటెన్సివిస్టులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శరత్ కుమార్, ఐసీయూ సిబ్బంది ఎంతగానో సహకరించారని.. వారందరి కృషితోనే వెంకటనారాయణ ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు.
ఇంత సంక్లిష్టమైన చికిత్సలకు సాధారణంగా అయితే హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకే వెళ్లాలి. కానీ, ఈ పేషెంటును అంత దూరం వరకు తీసుకెళ్లడం కూడా కష్టం. అంబులెన్సులోనే ప్రాణాలు పోయే ప్రమాదం సైతం ఉంటుంది. కానీ, కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు ఉండటంతో పాటు అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణులూ 24 గంటలూ అందుబాటులో ఉన్నారు. ఒకవైపు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, మరోవైపు నెఫ్రాలజిస్టు, కార్డియాలజిస్టు.. వీరితో పాటు ఐసీయూలో రోగి ప్రాణాలను కాపాడేందుకు ఉండే ప్రత్యేక నిపుణులైన ఇంటెన్సివిస్టులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శరత్ కుమార్ కూడా రోగి వెంకట నారాయణను కంటికి రెప్పలా కాపాడారు. ఇలాంటి పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్న రోగులు ఇకమీదట సంక్లిష్ట చికిత్సలకు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాయలసీమలోనే కర్నూలు నగరంలో కిమ్స్ ఆస్పత్రిలో ఎంతటి తీవ్రమైన సమస్యకైనా చికిత్స పొందవచ్చు.