ఏడుపాయల దుర్గమ్మకు 5లక్షల విరాళమిచ్చిన ఎమ్మెల్సీ కవిత
మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ మాత పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. తాజాగా, అమ్మవారి ఆలయంలో నూతన రథం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరాళం ప్రకటించారు. చారిత్రక పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా మాత అమ్మవారి ఆలయంలో కొత్త రథం నిర్మాణం కోసం రూ.5 లక్షల విరాళం ఇచ్చినట్టు వెల్లడించారు. తన ఎమ్మెల్సీ వేతనం నుంచి ఉడుతాభక్తిగా ఈ విరాళం ఇచ్చానని కవిత తెలిపారు. విరాళాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ద్వారా ఆలయ కమిటీకి అందజేసినట్టు వివరించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఏడుపాయల దుర్గమ్మ క్షేత్రాన్ని 12వ శతాబ్దంలో నిర్మించిన ఆలయంగా భావిస్తారు. ఇది మంజీరా నదీ తీరాన కొలువై ఉంది. ఇక్కడికి తెలంగాణలోని వారే కాకుండా, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివస్తారు.