ప్రపంచంలోనే తొలిసారిగా కిమ్స్‌లో అరుదైన సర్జరీ
కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆస్పత్రి ప్రపంచంలోనే తొలిసారిగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్సను ఆటోగైడ్ పద్ధతిలో చేసింది. పార్కిన్సన్స్ వ్యాధి, కదలికలకు సంబంధించిన ఇతర సమస్యలకు కారణమైన మెదడు వ్యాధుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పును ఈ ప్రక్రియ తేనుంది.
కిమ్స్ ఆస్పత్రి (సికింద్రాబాద్)లో న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ మానస్ పాణిగ్రాహి నేతృత్వంలోని వైద్యులు రేపటి తరం సాంకేతికతను ఈరోజే అందించేదుకు ఓ సరికొత్త విధానాన్ని రూపొందించారు. హైదరాబాద్ నగరానికి చెదిన 32 ఏళ్ల వయసున్న అభినయ్ అనే యువకుడికి చేతులు, కాళ్లు బాగా బిగుసుకుపోయి, పార్కిన్సన్స్ వ్యాధిలో ఉన్నట్లే నడవడం కూడా బాగా కష్టంగా మారింది. అతడికి అత్యాధునిక చికిత్స విధానాలతో 2022 మార్చి 3న చికిత్స చేశారు. ఈ చికిత్స వివరాలను కిమ్స్ ఆస్పత్రి (సికింద్రాబాద్)లో న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ మానస్ పాణిగ్రాహి తెలిపారు.
‘‘దాదాపు ఆరేళ్ల క్రితం (అప్పుడు 26 ఏళ్ల వయసు) కుడిచేతిలో వణుకు రావడాన్ని అభినయ్ కుమార్ గుర్తించారు. అది క్రమంగా బాగా పెరిగింది. దానివల్ల అతడు టీకప్పు కూడా చేత్తో పట్టుకోలేకపోయాడు. వ్యాధి పెరిగేకొద్దీ కనీసం నడిచే పరిస్థితి కూడా లేక.. ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అతడి మెదడులో ఉన్న సమస్యను సరిచేయడానికి అత్యంత కచ్చితత్వంతో కూడిన శస్త్రచికిత్స ఒకటి చేయాల్సి వచ్చింది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయడంలో కచ్చితత్వం చాలా కీలకం. ఇందుకోసం పార్కిన్సన్స్ డిసీజ్, కదలికలకు సంబంధించిన ఇతర సమస్యల్లో అత్యంత నిపుణులైన న్యూరోసర్జన్లు, న్యూరాలజిస్టులతో పాటు.. అత్యంత కచ్చితమైన రోబోటిక్ టూల్ కూడా ఒకటి ఉంది. దాని సాయంతో మెదడులో కచ్చితమైన ప్రాంతాన్ని చేరుకోవడం ద్వారా సమస్యకు చికిత్స చేయగలిగాం’’ అన్నారు.
ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడంలో డాక్టర్ మానస్ పాణిగ్రాహికి ఇంకా కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ధనుంజయ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, ఆస్పత్రిలోని అత్యంత నిపుణులైన నర్సింగ్ సిబ్బంది సాయపడ్డారు.
ఇలాంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయడానికి ఆసియాలో ఉన్న అతికొద్ది కేంద్రాల్లో కిమ్స్ ఆస్పత్రిలోని పార్కిన్సన్స్ సెంటర్ ఒకటి. కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోటిక్ సిస్టమ్ మూర్ఛ శస్త్రచికిత్స, బ్రెయిన్ ట్యూమర్ బయాప్సీ, పార్కిన్సన్స్ వ్యాధికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, కదలికల సమస్యలు కొన్ని మానసిక సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయుక్తంగా ఉంటుంది.
మెదడులో లక్షిత ప్రాంతాన్ని చేరుకోడానికి కచ్చితమైన పొజిషన్, మార్గాన్ని స్టెల్త్ ఆటోగైడ్ రోబో లెక్కిస్తుంది. న్యూరోసర్జన్లు చాలా చిన్న ఎలక్ట్రోడ్‌లతో కూడిన అతి సన్నటి వైరును దాని మొనమీద పెడతారు. అది అత్యంత తక్కువ కణజాలాలకు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అందిస్తుంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సరిగ్గా జరగాలంటే, అది కచ్చితంగా 0.8 నుంచి 1.2 మిల్లీమీటర్ల ప్రాంతంలోనే చేయాల్సి ఉంటుంది. స్టెల్త్ ఆటోగైడ్ రోబోను ఉపయోగించడం ద్వారా కిమ్స్ ఆస్పత్రిలో చేసిన ఈ శస్త్రచికిత్సలో 0.2 మిల్లీమీటర్ల కచ్చితత్వంతోనే చేయగలిగాం. ఆటోగైడ్ సమాచారం ప్రకారం దేశంలోనే ఇంత కచ్చితత్వంతో చేయడం ఇదే మొదటిసారి. తలవెంట్రుక మందంలోనే ఇది చేయగలిగాం.
ఒకవేళ ఈ శస్త్రచికిత్సను మాన్యువల్ పద్ధతిలో చేస్తే న్యూరోసర్జన్లు తమంతట తామే కోఆర్డినేట్లను లెక్కించుకుని, తన సొంత చేతులతో మెదడులో లీడ్స్ బిగించాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఆటోగైడ్ రోబో ఉండటంతో.. సర్జన్లు ఫీడ్ చేసిన సమాచారాన్ని బట్టి, కోఆర్డినేట్లను రోబో సిద్ధం చేస్తుంది. ఇచ్చిన సూచనలకు అనుగుణంగా అత్యంత కచ్చితత్వంతో అది మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తుంది.
శస్త్రచికిత్స జరిగిన తర్వాత అభినయ్ కుమార్ పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలన్నా అది చేసుకోగలుగుతున్నాడు. ఈ సందర్భంగా అభినయ్ కుమార్ మాట్లాడుతూ, “నాకు 2016లో చేతిలో వణుకు మొదలైంది. ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేవాడిని. ఈ సమస్య కారణంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. మొదట్లో నేను వేర్వేరు వైద్యుల వద్దకు వెళ్లి అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద మందులు వాడాను. కానీ వేటితోనూ నాకు ఫలితం కనపడలేదు. తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు కిమ్స్ ఆస్పత్రిలోని డాక్టర్ మానస్ పాణిగ్రాహి గురించి తెలిసింది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి అని ఆయన చెప్పారు. డీబీఎస్ చేసిన తర్వాత వణుకు పూర్తిగా ఆగిపోయింది. వైద్యులు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. త్వరలోనే నేను మళ్లీ ఉద్యోగం కూడా చేసుకుంటాను ” అని ఎంతో ఆనందంగా తెలిపారు.