సింథటిక్ రంగులు కళ్లకు హాని కలిగిస్తాయి
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం రంగుల పండగ హోలి జరుపుకుంటాం. అయితే సింథిటిక్ రంగులు వాడటం వలన మనం తెలియకుండానే మనకు లేదా ఇతరులకు హాని కలిగిస్తాం. రసాయనాలతో కూడిన రంగుల వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలు కంటిపై దీర్ఘకాలం ఉంటాయి, కొన్నిసార్లు చూపు కోల్పోవడం కూడా జరుగుతుంది. ప్రతీ సంవత్సం హోలి, ఆ తర్వాత కంటి సమస్యలకు సంబంధించి వేల కేసులు వస్తుంటాయి. రంగుల పండగ సరదా, సంతోషాలు కొందరికి విషాదంగా, దుఃఖంగా మారుతాయి. హోలిని సురక్షితంగా జరుపుకునేందుకు అదే సమయంలో కళ్లను ఆరోగ్యకరంగా, ప్రకాశవంతంగా ఉంచేందుకు డాక్టర్ గౌరవ్ అరోరా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
సింథటిక్, విషపూరిత రసాయన రంగులు కళ్లకు సరిదిద్దలేని నష్టాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక డైలు, ఆల్కాలిస్‌తో తయారయ్యే ఈ రంగుల్లో పాదరసం, ఆస్బెస్టాస్, సిలికా, మైకా, సీసం వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చాలా విషపూరితమైనవి. వీటి వలన కొన్నిసార్లు శాశ్వతంగా దృష్టి కోల్పోవచ్చు. నేడు అవగాహన కారణంగా మార్కెట్‌లో సేంద్రీయ రంగులు, సాంప్రదాయ సహజ రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇవి పువ్వులు, పసుపు, ఇతర ఆర్గానిక్ ఉత్పత్తులు, డైల నుంచి తయారవుతాయి కాబట్టి మన శరీరానికి హాని చేయవు.
“కళ్లలో రంగు పడినట్టు అయితే మనం కళ్లు రుద్దకూడదు, దాని వలన కార్నియల్ రాపిడి జరిగి కార్నియా దెబ్బ తింటుంది. అంతే కాకుండా అది కంటి ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలకు దారితీస్తుంది. పొరపాటున కంట్లో రంగు పడినట్టు అయితే మనం వెంటనే చేతులు శుభ్రం చేసుకొని అరచేతిలో నీళ్ళు తీసుకొని ఆ నీటిలో కళ్లను సున్నితంగా కదిలించే ప్రయత్నం చేయాలి. కంటిలోకి నీటిని చిమ్మకూడదు, అలా చేస్తే అది గాయాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. రుమాలు, టిష్యూ ఉపయోగించి నలుసు పదార్థాలు తొలగించే ప్రయత్నం చేయవద్దు. అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది” అని డాక్టర్. గౌరవ్ అరోరా అన్నారు.
కాంటాక్ట్ లెన్సులు హైగ్రోస్కోపిక్ లక్షణాలు కలిగి ఉంటాయి అంటే అవి సులభంగా నీటిని పీల్చుకుంటాయి, కాబట్టి రంగు నీరు కళ్లలో పడితే అది అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కంట్లో మంటగా ఉంటే వెంటనే మీ అద్దాలు ఉపయోగించాలి లేదా వెంటనే తొలగించగల డిస్పొజబుల్ కాంటాక్ట్ లెన్స్ ఎంచుకోవాలి.
పైన పేర్కొన్న విషయాలను ప్రస్తావిస్తూ డాక్టర్. గౌరవ్ అరోరా, “కంటి గాయం లేదా దెబ్బతింటుందనే సంకేతం ఉంటే మనం వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించాలి. మన ప్రియమైనవారికి ఇబ్బంది నుంచి కొంత ఉపశమనం కల్పించేందుకు మునం ఇంటి చిట్కాలు ఉపయోగించడం లేదా అందుబాటులో ఉన్న ఐ డ్రాప్స్, ఆయింట్‌మెంట్ వంటివి వాడతాం. కాని వాటి వలన మేలు కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. నిరంతరం కన్నుఎర్రబారి ఉండటం, నీళ్లు రావడం, ఊసులు, దురద, అసౌకర్యం, గాయం, రక్తస్రావం వంటి వాటి విషయంలో వెంటనే సమీపంలోని నేత్ర సంరక్షణ నిపుణుల దగ్గరకు వెళ్లాలి. ఆ గాయం తీవ్రత, దాని స్వభావాన్ని కంటి నిపుణుడు అంచనా వేసి దానికి సరైన చికిత్స సూచిస్తారు” అన్నారు.
ఈ హోలీని ఆరోగ్యకరంగా, సంతోషంగా జరుపుకునేందుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం.