విక్రమ్‌పురిలో ఏఐఎన్‌యూ ప్రారంభం

భార‌త‌దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌లో అంత‌ర్జాతీయ స్థాయి, అతిపెద్ద‌వాటిలో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) జంట న‌గ‌రాల్లో క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌లోని విక్ర‌మ్‌పురిలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. జంట న‌గ‌రాల్లో ఇది ఏఐఎన్‌యూ నాలుగో ఆస్ప‌త్రి. ఇంటెన్సివ్ కేర్ కోసం ప్ర‌త్యేకించిన ప‌డ‌క‌ల‌తో పాటు మొత్తం 50 ప‌డ‌క‌ల కిడ్నీకేర్ సెంట‌ర్ ఇది. ప్రారంభ కార్య‌క్ర‌మంలో మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పీసీ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని విక్రమ్‌పురిలో వైద్యులు, సహాయక సిబ్బందితో సహా మొత్తం 70 మంది సిబ్బంది పనిచేయనున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 400 పడకల సామర్థ్యంతో ఆరు ఆస్ప‌త్రులను ఏఐఎన్‌యూ నిర్వహిస్తోంది.
2013 లో స్థాపించిన ఏఐఎన్‌యూ ప్రత్యేకంగా యూరాలజీ మరియు నెఫ్రాలజీ మీదే దృష్టి కేంద్రీక‌రించిన టెర్షియ‌రీ కేర్ ఆస్ప‌త్రి. ఇది వైద్య, శస్త్రచికిత్స, డే కేర్, సహాయక సేవలను పూర్తిస్థాయిలో అందిస్తుంది. ఈ కొత్త కేంద్రంలో 10 పడకల ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఉంది. తీవ్రమైన అస్వస్థతతో ఉన్న రోగుల కోసం అధునాతన హెచ్‌డీఎఫ్ డయాలసిస్ సామర్థ్యం కలిగిన యూనిట్లు ఉంటాయి. రోగులకు నాణ్యమైన సంరక్షణ అందించడానికి ఫుల్‌టైం ప‌నిచేసే యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టుల ప్రత్యేక బృందం 24×7 అందుబాటులో ఉంటుంది.

గత తొమ్మిదేళ్లలో, ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందిన ఏఐఎన్‌యూ మూత్రపిండాల సంరక్షణకు అంకితమైన 400 పడకలతో ఒక ప్రధాన సంస్థగా నిలిచింది. ఏఐఎన్‌యూ శస్త్రచికిత్స, మూత్రపిండాల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు రెండూ ఉంటాయి. మూత్రపిండాల రాళ్లు, ప్రోస్టేట్ పెర‌గ‌డం, మూత్రపిండాల కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, మూత్రాశయ కేన్సర్, పుట్టుకతో వ‌చ్చే మూత్రనాళ స‌మ‌స్య‌లు, మూత్రపిండాల మార్పిడి కోసం సంక్లిష్టమైన, ఉన్నత స్థాయి ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ యూర‌లాజిక‌ల్ ప్రొసీజ‌ర్ల‌కు రిఫరల్ ఆస్ప‌త్రిగా రూపొందింది.

కొత్త సదుపాయం గురించి ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అంత‌ర్జాతీయ స్థాయి సదుపాయాలు, అధునాతన చికిత్స‌ల‌కు ప్రసిద్ధి చెందింది. ఈ కొత్త ఆస్ప‌త్రి సికింద్రాబాద్‌లోని విక్ర‌మ్‌పురి, చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవలందిస్తుంది. ఇక్క‌డ‌ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, మల్టీ స్లైస్ సిటి స్కాన్, యూరోడైనమిక్స్ తో కూడిన సమగ్రమైన ల్యాబొరేట‌రీ, డ‌యాగ్న‌స్టిక్ స‌దుపాయాలు అన్నీ ఉన్నాయి. హై-ఎండ్ ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు చేయడానికి లేజర్స్ వంటి అన్ని అత్యాధునిక‌ శస్త్రచికిత్స పరికరాలతో యూరాలజికల్ ప్రొసీజ‌ర్ల‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన‌ రెండు పూర్తి స్థాయి ఆపరేటింగ్ థియేట‌ర్లు ఉన్నాయి” అని చెప్పారు.

“నెఫ్రాలాజికల్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎక్యూట్ కిడ్నీ కేర్‌ యూనిట్‌లో అత్యాధునిక హెచ్డీఎఫ్ డయాలసిస్ యంత్రాలు, మూత్రపిండాల మార్పిడి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా చేయ‌డంలో అద్భుత‌మైన‌ ట్రాక్ రికార్డును ఏఐఎన్‌యూ కలిగి ఉంది. ఏఐఎన్‌యూలో వైద్య‌రంగానికి మూత్ర‌పిండాల సంర‌క్ష‌ణ‌లో వ‌స్తున్న అత్యాధునిక ప‌రిజ్ఞానాన్ని అందించ‌డంపై ఎప్పుడూ దృష్టిపెడ‌తాం” అని ఏఐఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పి.సి. రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో నాలుగు అధునాతన ఆస్ప‌త్రులు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ‌ప‌ట్నం, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో ఒక్కో ఆస్ప‌త్రితో.. ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రుల గ్రూపు.. నెఫ్రాలజీ మరియు యూరాలజీలోని ప్రధాన సంస్థలలో ఒకటిగా నిలిచింది. వైద్య, శస్త్రచికిత్స, సాంకేతిక పురోగతిలో కొత్త పరిణామాలలో ముందంజలో ఉంది.