మానవసేవలో అంకితమైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి
నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి తన మూడో వార్షికోత్సవాన్ని ఈరోజు ఆడంబరంగా, ఉల్లాసంగా చేసుకుంది. ఈ సందర్భంగా ఇన్నాళ్లూ, ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యయంత్రాంగమంతా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నసమయంలో కూడా పూర్తి నిబద్ధతతో పనిచేసి, మానవసేవలో నిమగ్నమైన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది సేవలను ఆస్పత్రి యాజమాన్యం గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంప్యానల్ కావడం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమైన లైసెన్సు పొందడం లాంటి విషయాల్లోనూ ఎస్ఎల్‌జీ ఆస్పత్రి సంబరం చేసుకుంది.
రంగులమయమైన, సరదాగా నిండిన సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు, ప్రత్యేక ఆహ్వానితులు, కొంతమంది రోగులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైద్యులు, నర్సులు, కీలక సహాయక సిబ్బందికి యాజమాన్యం మెమొంటోలను బహూకరించింది. కొన్ని రోజులుగా ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది అందరికీ కొన్ని క్రీడా పోటీలను నిర్వహించగా… వైద్యులు, ఇతర సిబ్బంది కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలతో సాయంత్రాన్ని మరింత రంగులమయం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దండు శివ రామరాజు మాట్లాడుతూ,
“మా ఆస్పత్రి ప్రారంభ సమయంలోనే కఠినమైన దశను ఎదుర్కొంది! ప్రారంభమైన ఒక సంవత్సరంలోపే ఎస్ఎల్‌జీ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ప్రపంచాన్ని కదిలించిన మహమ్మారి సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. మా వైద్యులపై మాకు పూర్తి నమ్మకం ఉంది. వారు ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాడటానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. మానవాళికి 1,095 రోజులు లేదా 26,240 గంటల నిరంతరాయ సేవను మేం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇదేమీ చిన్నపాటి విజయం కాదు. ఈ సంస్థతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విజయానికి కారకులే ” అన్నారు.
“మా వైద్యులతో పాటు.. నర్సింగ్, ఇతర సిబ్బందిలో పిన్నవయస్కులు కూడా ఈ కష్టకాలంలో గట్టిగా నిలబడ్డారు. ముందెన్నడూ ఎదురుకాని ఇలాంటి సమయంలో వేలాది ప్రాణాలను కాపాడారు. ఇంత చిన్నవయసు వారికి ప్రాణాలు పణంగా పెట్టడం అంటే అంత సులభం కాదు. అయినా ముఖాల మీద చిరునవ్వుతోనే వారీ సవాళ్లను ఎదుర్కొన్నారు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి తిరిగి వెళ్లిన రోగుల నుంచి మా సిబ్బంది సేవలను ప్రశంసించే అనేక రుజువులు మాకు ఉన్నాయి. అత్యంత సంక్లిష్టమైన సమయంలో కూడా కీలకపాత్రలు పోసించినందుకు చరిత్రలో ఈ హీరోల పేర్లు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డివిఎస్ సోమరాజు తెలిపారు.
వైద్యులు, ఇతర సహాయ సిబ్బంది సేవలను ఎస్ఎల్‌జీ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ పాణిగ్రాహి కూడా ప్రశంసించారు. అన్నిరంగాలకు చెందిన 450 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎస్ఎల్‌జీ ఆస్పత్రి నిబద్ధతను, ప్రయత్నాలను ప్రశంసించారు. ప్రభుత్వవర్గాలు సహా, సమాజంలోని వివిధ వర్గాల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తాయి.