ఫిడ్స్‌పై అపోహాలు వద్దు : ఎస్ఎల్‌జీ హాస్పిటల్ వైద్యులు
మూర్ఛ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి రెండో సోమవారాన్ని 120 దేశాల్లో అంతర్జాతీయ మూర్ఛదినంగా నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆస్పత్రిగా శరవేగంగా ఎదుగుతున్న ఎస్ఎల్‌జీ ఆస్పత్రి అంతర్జాతీయ మూర్ఛ దినం సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో ప్రజలు ఈ సమస్యతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించేందుకు ఒక శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వివిధరంగాల నుంచి 150 మంది హాజరయ్యారు.
ఈ శిబిరం సందర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ అభినయ్ ఎం హుచ్చే మాట్లాడుతూ, “ఇది ఎప్పటినుంచో అందరికీ తెలిసిన ఆరోగ్య సమస్య అయినా, మూర్ఛ గురించి అనేక అపార్థాలు, భయాలు ఉన్నాయి. దీనివల్ల ఈ సమస్య గురించి ప్రజలు చర్చించడానికి వెనకాడతారు. దీనివల్ల సమాజంలో మూర్ఛ ఉన్నవారి పట్ల కొంత వివక్ష కూడా ఎదురవుతోంది. నిజానికి మూర్ఛవ్యాధి విషయంలో ఈ సమస్యను కాకుండా.. అపార్థాలను, వివక్షను ముందుగా దూరం చేయాలి. అదే పెద్ద సమస్య” అని చెప్పారు.
“ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఈ సమస్యగురించి అవగాహనకు శిబిరం నిర్వహిస్తోంది. దీనిద్వారా మూర్ఛ ఉన్నవారితో పాటు మొత్తం సమాజానికి కూడా దీని గురించి పూర్తిగా తెలుస్తుంది. సిమ్యులేషన్ సెషన్, ఈ విషయం గురించి చర్చ, ఇందులో పాల్గొన్నవారి నుంచి వచ్చిన స్పందన అన్నీ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇలాంటి సెషన్లు, శిబిరాల వల్ల సమాజంలో ఉండే మనమంతా కూడా మూర్ఛ వ్యాధి ఉన్నవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించగలుగుతాం” అని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి సీనియర్ న్యూరాలజిస్టు డాక్టర్ సుమ చెప్పారు.
ఇదే సమస్య గురించి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ, “మూర్ఛ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు మన దేశంలో కోటి మందికి పైగా ఉంటారని ఒక అంచనా. వీరిలో చాలామందికి దీనిపై అవగాహన లేకపోవపడం వల్ల సరైన సమయానికి సరైన చికిత్స అందడం లేదు. మూర్ఛను తగ్గించే మందుల గురించి తెలియకపోవడం, పేదరికం, మూఢ నమ్మకాలు, భయం, వైద్యపరమైన మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, శిక్షణ పొందిన నిపుణుల కొరత లాంటివాటి వల్ల చికిత్స సరిగా అందడం లేదు. ఇలాంటి సెషన్ల వల్ల అవగాహన పెరిగి, ఆరోగ్యకరమైన భారతదేశం ఏర్పడుతుంది” అని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసులకు చెందిన 5 కోట్ల మందికి మూర్ఛవ్యాధి ఉందని అంచనా. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు మెరుగవ్వాల్సిన తక్షణ అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో తెలిపారు. ప్రపంచంలో మూర్ఛ ఉన్నవారంతా ఎలాంటి వివక్షకు, కళంకానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా పూర్తి సమన్వయంతో కూడిన ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలని కూడా ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పింది. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు చెందినవారిలో 75% మంది మూర్ఛ ఉన్నా వారికి సమర్థంగా పనిచేసే, మూర్ఛను తగ్గించే చవక మందులు అందుబాటులో లేవు. ఫలితంగా వారు తక్కువ వయసులోనే మరణించడం లేదా, ఉన్నన్నాళ్లూ కళంకితులుగా మిగిలిపోవడం లాంటి ముప్పు ఉంటోంది.