కారుదిగి క‌మ‌లం చేత‌బ‌ట్టిన తుక్కుగూడ మున్సిపాలిటీ

తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రోజు రోజుకు అధికార పార్టీ ప‌ట్టుకొల్పోతున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. కొత్త‌గా జిల్లా అధ్య‌క్షులగా ప‌ద‌వులు ఇచ్చిన త‌రువాత పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌నే చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేధాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియ‌మితులైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇది ఒక గ‌ట్టి దెబ్బ‌గా చెప్పుకోవ‌చ్చు.

రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ పురపాలికను దక్కించుకుంది క‌మ‌లం పార్టీ. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి తుక్కుగూడ మున్సిపాలిటీ చేజారి బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. దీంతో కాషాయ పార్టీకి రంగారెడ్డి జిల్లాలో 3 పురపాలికలు దక్కినట్లయింది. మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న కాంటేకార్‌ మధుమోహన్‌ బుధవారం ఢిల్లీలో కమలం కండువా కప్పుకొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాకాలో చోటుచేసుకున్న పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.. ఈ మున్సిపాలిటీలో 15 వార్డులుండగా, రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 5, బీజేపీ 9, స్వతంత్ర అభ్యర్థిగా కాంటేకార్‌ మధుమోహన్‌ గెలుపొందారు. ఆయనకే చైర్మన్‌‌ను చేసి 5 ఎక్స్‌ అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీని టీఆర్ఎస్ దక్కించుకుంది. అయితే కొద్ది రోజుల నుంచే మధు మోహన్ టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఇటీవల మంత్రి కేటీఆర్‌ పర్యటనలో మధుమోహన్‌ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. తెరాస నాయకులతో పొసగడంలేదన్న ప్రచారం జరిగింది. నిజానికి మధుమోహన్‌ బీజేపీకి చెందిన వారే. అయితే గత ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు.

మూడేళ్ల వరకు ఆ చాన్స్ లేదు..
అయితే మున్సిపల్‌ చట్టం ప్రకారం మూడేళ్ల వరకు చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేదు.. రెండేళ్లు గడవడంతో మరో ఏడాది మధుమోహన్‌ పదవికి ఇబ్బంది ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మధుమోహన్‌పై టీఆర్ఎస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. టీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్‌గిరీ దక్కించుకుని.. బీజేపీలో చేరడం సిగ్గుచేటని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేసి బీజేపీ గుర్తుపై గెలవాలని సవాల్ విసిరారు.