హైదారాబాద్‌లో ప్ర‌ధాని మోడీ ఫుల్ షెడ్యూల్

భార‌తదేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ శ‌నివారం హైదారాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింత‌ల్‌లో ఏర్పాటు చేసిన రామానుజ‌చార్య‌లు భారీ విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. శ‌నివారం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు మోడీ. హెలిపాడ్‌లో దిగిన తర్వాత సమీపంలోని అతిథి గృహానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాలపాటు సేదతీరిన తర్వాత.. అక్కడి నుంచి నేరుగా యాగశాలకు వెళ్తారు మోడీ. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకుని.. విశ్వక్‌సేనుడి పూజను నిర్వహిస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుంటారు. సమతామూర్తి కేంద్రంలో.. 108 దివ్యదేశాలతోపాటు భద్రవేది మొదటి అంతస్తులోని స్వర్ణమయ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు మోడీ. సుమారు అరగంటపాటు ఈ ప్రక్రియ జరుగుతుంది.

అనంతరం భద్రవేది మూడో అంతస్తులో 216 అడుగుల రూపంలో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి.. శ్రీత్రిదండి చిన్నజీయర్‌స్వామితో కలిసి పూజలు నిర్వహిస్తారు ప్రధాని. పూజల అనంతరం రాత్రి 7గంటలకు.. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడే సుమారు అరంగపాటు ప్రసంగిస్తారు. ఆ తర్వాత రామానుజచార్యుల విగ్రహంపై 15నిమిషాలపాటు జరిగే 3డీ షోను వీక్షిస్తారు. అక్కడి నుంచి మరోసారి యాగశాలకు చేరుకుని.. శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలుకుతారు. ఈ సంద్భంగా 5వేల మంది రుత్వికులు ప్రధాని మోడీకి వేద ఆశీర్వాదం ఇస్తారు.

అయితే ప్రధాని మోడీకి ఎవరు స్వాగతం పలుకుతారు అన్న సస్సెన్స్‌కు క్లారిటీ వచ్చింది. ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో..కేసీఆర్‌ స్థానంలో.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌.. ప్రధానికి స్వాగతం పలకనున్నారు. రేపు మధ్యాహ్నం 2గంటల 10 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోడీ శంషాబాద్‌ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తలసాని.. ప్రధానికి స్వాగతం పలుకుతారు. వీడ్కోలు కార్యక్రమంలో కూడా తలసానినే పాల్గొంటారు.

ఎటు చూసినా పోలీసులు.. బాంబ్‌ స్క్వాడ్‌.. భద్రతా సిబ్బంది తనిఖీలు.. హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో భగవత్‌ రామానుజుల విగ్రహావిష్కరణకు రేపు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సమతామూర్తి ప్రాంగణం మొత్తం ఎస్పీజీ రక్షణ వలయంలోకి వెళ్లిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు స్పెషల్‌ ఫోర్స్‌, ఆక్టోపస్‌ పోలీసులు సైతం అటు యజ్ఞశాల, ఇటు సమతామూర్తి ప్రాంగణంతోపాటు ఆశ్రమ పరిసరాల్లో తనిఖీలు చేస్తున్నాయి..

డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ ప్రాంగణమంతా శోధిస్తున్నాయి.. అటు యాగశాల ప్రాంగణంలోకి వచ్చే భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి పంపిస్తున్నారు.. లగేజీ తనిఖీ కోసం ప్రత్యేక స్కానర్లను ఉపయోగిస్తున్నారు.. శ్రీరామనగరానికి వచ్చే రహదారుల్లోనూ పోలీసు పహారా పెరిగింది.. హైవే నుంచి లోనికి వచ్చే కొన్ని రహదారుల్ని మూసివేశారు.. సందర్శకుల వాహనాలకు దాదాపు రెండు కిలోమీటర్ల ముందుగానే పార్కింగ్‌ స్థలాన్ని కేటాయిస్తున్నారు.