డ్ర‌గ్స్‌పై దూకుడు పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం

డ్రగ్స్‌ కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే డీజీపీకి సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. వెయ్యి మందితో ఐజీ స్థాయి అధికారితో ఓ టాస్కు ఫోర్స్‌ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాట కూడా వినిపించకూడదని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీజీపీ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు అందరు అధికారులతో డీజీపీ అన్ని విషయాలపై చర్చించారు. పలు కీలక ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

డీజీపీ సమీక్షలో చేసిన కీలక ప్రతిపాదనలు.. పదేళ్ల నుంచి డేటాను సిద్ధం చేశారు. గడిచిన పదేళ్లలో ఎవరు డ్రగ్స్‌ విక్రయిస్తూ దొరికారు. ఎవరెవరూ డ్రగ్స్‌ వినియోగిస్తూ పట్టుబడ్డారు. వారందరి పేర్లు వివరాలతో ఓ జాబితా సిద్ధం చేశారు. డ్రగ్స్‌ తో పాటు గంజాయి వినియోగించే వారి వివరాలను కూడా పొందుపరిచారు. ఈ జాబితాలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, సెలబ్రిటీల వివరాలు పొందుపరిచారు.

డ్రగ్స్‌ పై నిఘా కోసం తెలంగాణ పోలీసు శాఖ ఓ యాప్‌ ను కూడా రూపొందించింది. ‘Dopam’ ఓ యాప్‌ ను రూపొందించారు. డ్రగ్స్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ యాప్‌ లో అప్‌ డేట్‌ చేయనున్నారు. డ్రగ్స్‌ క్రయ, విక్రయాలు చేసిన వారి వివరాలు కూడా ఈ యాప్‌ లో పొందుపరుస్తారు. తమ ప్రతిపాదనలను సీఎం ఎదుట ఉంచుతామని పోలీసు శాఖ తెలిపింది. డ్రగ్స్‌ విషయంలో తెలంగాణ సర్కారు దూకుడుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.