డెల్టా, ఒమిక్రాన్.. మరే వేరియంట్‌కైనా టీకాయే ఏకైక పరిష్కారం: డాక్టర్ రోహిత్ రెడ్డి
కొవిడ్-19పై అవగాహన పెంచేందుకు, ఈ పరీక్షాసమయంలో ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) హైదరాబాద్ విభాగం వివిధ వ్యాపారసంస్థల యజమానుల కోసం ఒక వెబినార్ నిర్వహించింది. ఇందులో వివిధ వ్యాపారాలకు చెందిన 250 మంది పాల్గొన్నారు. సెంచురీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్టు డాక్టర్ రోహిత్ రెడ్డి ఈ వెబినార్ నిర్వహించారు. చాలామంది వ్యాపారవేత్తలు తమ వద్ద పనిచేసే వేల మంది ఉద్యోగులు, సిబ్బంది తరఫున ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. వీరంతా ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి మార్గాలు, తమకున్న అనుమానాలు అడిగారు. వారి ప్రతి ఒక్క అనుమానాన్ని డాక్టర్ తీర్చారు.
ఈ సందర్బంగా సెంచురీ ఆస్పత్రి కన్సల్టెంట్ పల్మనాలజిస్టు డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, “కరోనా వైరస్ తరచు రూపం మార్చుకుంటూ కొత్త వేరియంట్ లేదా కొత్త మ్యుటేషన్‌గా వస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఈ కొత్త వైరస్ మనమధ్య ఎన్నాళ్లు ఉంటుందని ఎవరూ చెప్పలేకపోయినా, ఈ సమస్యను ఎదుర్కోడానికి ఉన్న ఏకైక పరిష్కారం టీకాయే.”
“జ్వరలక్షణాలను, బ్యాక్టీరియా/ వైరస్ / ఫంగస్‌లను నిరోధించేవి, రోగనిరోధక శక్తినిపెంచే లక్షణాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మందులు వాడాల్సిన, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం తగ్గుతుంది. శరీరంలో పేగులు అతిపెద్ద భాగం. వాటిలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి మూలం. ఈ సమస్యను తగ్గించడానికి అవసరమైన ప్రోబయాటిక్స్ కూడా అక్కడే ఉంటాయి” అని డాక్టర్ రోహిత్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా బీఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా మాట్లాడుతూ, “బీఎన్ఐ హైదరాబాద్ అనేది కొందరు వ్యాపారవేత్తలు, వాణిజ్య నిపుణుల సముదాయం. వీరంతా కలిసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బీఎన్ఐ సభ్యులంతా తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను తమ సొంత కుటుంబంలా జాగ్రత్తగా చూసుకుంటారు. మహమ్మారి గురించి బాగా అర్థం చేసుకుని, దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి డాక్టర్ రోహిత్ రెడ్డి నిర్వహించిన ఈ అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది” అని తెలిపారు.
వైరస్ వేగంగా వ్యాపిస్తూ సమాజంలోకి వెళ్లిపోతోంది. దాన్ని నిరోధించడం కష్టం. ప్రభుత్వం, ఆరోగ్యశాఖ యంత్రాంగం దానివల్ల ప్రజల్లో మరణాలను తగ్గించడానికి దృష్టిపెడుతున్నాయి. అందువల్ల ప్రజలు ఈ కష్టకాలంలో జాగ్రత్తగా ఉండాలి. వారికి ఒకవేళ డెల్టా, ఒమిక్రాన్ లేదా మరేదైనా వేరియంట్ సోకినా కంగారు పడకుండా అప్రమత్తం కావాలి.
సెంచురీ ఆస్పత్రి గురించి:
హైదరాబాద్ నడిబొడ్డున 220 పడకలతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా సెంచురీ ఆస్పత్రి ఏర్పాటైంది. అగ్నిమాపక మార్గదర్శకాలు, ఎన్ఏబీహెచ్ ప్రమాణాల ప్రకారం నిర్మితమైన ఏకైక ఆస్పత్రి ఇదే. సెంచురీ ఆస్పత్రి బృందంలో వైద్యనిపుణులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు, సోషల్ వర్కర్లు, వలంటీర్ సేవలు, సహాయ సిబ్బంది, వృద్ధుల చికిత్స నిపుణులు ఇలా ఎందరో ఉన్నారు.