గర్భ‌శాయ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు : డా. సువ‌ర్ణా రాయ్‌

మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యానికి ముందుభాగంలో ఉండే ముఖ‌ద్వారానికి కొన్ని ర‌కాల ఇన్ఫెక్ష‌న్ల‌తో పాటు కేన్స‌ర్ కూడా సోకే ప్ర‌మాదం ఉంటుంది. మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంపొందించుకుని, దానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా గుర్తించాల‌ని ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు, లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ సువ‌ర్ణా రాయ్ సూచించారు. జ‌న‌వ‌రి నెల‌ను గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార ఆరోగ్య అవ‌గాహ‌న మాసంగా ప్ర‌తి సంవ‌త్స‌రం పాటిస్తారు. ఈ నేప‌థ్యంలో ఈ అంశం గురించి ప‌లు విష‌యాల‌ను ఆమె వెల్ల‌డించారు.

“స‌ర్వైక‌ల్ కేన్స‌ర్ ప‌రీక్ష‌ల‌లో పాప్‌స్మియ‌ర్ టెస్ట్ ఒక‌టి. గ‌ర్భాశ‌య ముఖ‌ద్వారంలో ఉండే కొన్ని క‌ణాల‌తో రూపొందిన స్మియ‌ర్ (పూత‌)ను తీసి దాన్ని ప‌రీక్షించి విశ్లేషిస్తారు. ఇది ఏమాత్రం నొప్పి లేని ప‌రీక్ష‌, దాని ఫ‌లితం కూడా త్వ‌ర‌గా వ‌స్తుంది. వ‌రుస‌గా మూడేళ్ల పాటు నెగెటివ్ ఫ‌లితం వ‌చ్చేవ‌ర‌కు ప్ర‌తియేటా ఈ ప‌రీక్ష చేయించాలి. త‌ర్వాత ప్ర‌తి మూడేళ్ల‌కోసారి చేయించాలి. ఇటీవ‌ల చాలావ‌ర‌కు మాస్ట‌ర్ హెల్త్ చెక‌ప్‌ల‌లో ఇది ఉంది. సిగ్గు వ‌ల్ల గానీ, అందులో ఉండే అసౌక‌ర్యం వ‌ల్ల గానీ ఈ ప‌రీక్ష చేయించుకోక‌పోవ‌డం స‌రికాదు.

ఎక్కువ‌మంది లైంగిక భాగస్వాములను పరిహరించడం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో లైంగిక జీవితాన్ని ప్రారంభించడం, ధూమపానం, యుక్త‌వ‌య‌సులోనే గర్భధారణలు, ఎక్కువ ప్ర‌స‌వాలు/పిల్లల జననాలు మరియు గర్భనిరోధక మాత్రల దీర్ఘకాలిక వినియోగం వంటి ప్రమాద కారకాలను పరిహరించడం ద్వారా గర్భాశయ ముఖ‌ద్వార కేన్సర్‌ను నిరోధించ‌వ‌చ్చు. త‌ర‌చు ఆరోగ్య‌ప‌రీక్ష‌లు, ఎప్ప‌టిక‌ప్పుడు పాప్‌స్మియ‌ర్ టెస్టులు చేయించుకోవ‌డం చాలా ముఖ్యం. కుటుంబంలో వేరెవ‌రికైనా ఈ కేన్స‌ర్ ఉంటే మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. గర్భాశయ ముఖ‌ద్వార కేన్సర్ నిరోధ టీకా తీసుకోవ‌డం చాలా కీల‌కం.

గర్భాశయ ముఖ‌ద్వార కేన్సర్ వ్యాక్సిన్ అనేది సాధారణంగా దీన్ని కలిగించే వైరస్ నుంచి రక్షణ. దీనిని హ్యూమన్ పాపిలోమా వైరస్/హెచ్ పివి అంటారు. ఈ వ్యాక్సిన్ ఆన‌ల్ కేన్సర్, జననేంద్రియ వార్ట్స్ మరియు కొన్ని రకాల నోరు మరియు గొంతు కేన్సర్ల వంటి ఇతర వైద్య సమస్యల నుంచి కూడా సంరక్షిస్తుంది. దీన్ని 9 నుంచి 14 సంవత్సరాల మధ్య 6 నెలల వ్యవధిలో 2 మోతాదుల్లో ఇస్తారు. 14 సంవత్సరాలు దాటిన‌వారికి 3 మోతాదుల్లో ఇస్తారు. చాలామంది బాలిక‌లు తీసుకోవాల్సిన వ‌య‌సులో ఈ వ్యాక్సిన్ తీసుకోరు. అయినా వారు తొలిసారి లైంగిక అనుభ‌వం పొందేముందు తీసుకున్నా చాలా మంచిది. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాక్సిన్ తీసుకోకుండా, లైంగిక జీవితంలో చురుగ్గా ఉన్న మ‌హిళ‌లు కూడా వారికి ఇప్ప‌టివ‌ర‌కు హెచ్ పివి సోక‌క‌పోతే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా వారికి అది ప‌నిచేస్తుంది.

గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార కేన్స‌ర్ వ‌చ్చిన రోగులు తొలిద‌శ‌లోనే ఆస్ప‌త్రుల‌కు వెళ్తారు. ఎందుకంటే ల‌క్ష‌ణాలు చాలా త్వ‌ర‌గా క‌న‌ప‌డే కేన్స‌ర్ల‌లో ఇది ఒక‌టి. రుతుక్ర‌మాల‌కు మ‌ధ్య‌లో బ్లీడింగ్ కావ‌డం, సంభోగం త‌ర్వాత బ్లీడింగ్ కావ‌డం, మెనోపాజ్ త‌ర్వాత కూడా బ్లీడింగ్ అవ్వ‌డం ఈ కేన్స‌ర్ ల‌క్ష‌ణాలు. కొంద‌రు మ‌హిళ‌ల్లో ఈ కేన్స‌ర్ వ‌చ్చిన తొలినాళ్ల‌లో త‌ర‌చు వైట్ డిశ్చార్జి అవుతూ అందులో ర‌క్తం చారిక‌లు ఉండొచ్చు.

భార‌త‌దేశంలో ఉన్న మొత్తం కేన్స‌ర్ల‌లో గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార కేన్స‌ర్లు పెద్ద‌సంఖ్య‌లో ఉన్నాయి. అందువ‌ల్ల దీని గురించిన విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని, మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోడానికి వైద్య‌ప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాలి” అని డాక్ట‌ర్ సువ‌ర్ణారాయ్ తెలిపారు.