28వ తేదీ నుండి రైతుబంధు

తెలంగాణ రైతాంగానికి శుభ‌వార్త తెలిపారు సీఎం కేసీఆర్‌. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు, దళితబంధుతో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించారు. పంట సాయం పంపిణీ ప్రారంభించిన పది రోజుల్లోనే రైతులందరికీ ఖాతాల్లోనే నగదును జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. గతంలో మాదిరిగానే ఎకరం మొదలుకొని విడుదల వారీగా అందరికీ పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

తరతరలాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రగతి భ‌వ‌న్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం ద్వారా వందశాతం సబ్సిడీ కింద అందించే రూ.10లక్షలు.. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహదపడుతుందని సీఎం స్పష్టం చేశారు.

దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళితబంధును ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామని వివరించారు.

కొత్త జోన‌ల్ విధానం ప్ర‌కార‌మే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు.

వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. భార్యాభర్తలిద్ద‌రూ ఉద్యోగులు అయితే (స్పౌస్ కేస్) ఒకే చోట విధులు నిర్వ‌ర్తిస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని సీఎం పేర్కొన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం సూచించారు.